ఇత‌ర న‌గరాల‌కు కాశీ మార్గదర్శి

కాశీలో జ‌రిగిన అభివృద్ధి దేశంలోని ఇత‌ర న‌గ‌రాల‌కు  మార్గసూచి కాగలదని   ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలిపారు. మ‌న దేశంలో చాలా న‌గ‌రాలు సంప్ర‌దాయ న‌గరాల‌ని, వాటి అభివృద్ధి కూడా ఇదే త‌ర‌హాలో చేప‌ట్టాల‌ని ఆయన సూచించారు. ఆయా న‌గ‌రాల్లోని స్ధానిక నైపుణ్యాలు, ఉత్ప‌త్తుల‌ను గుర్తించి ప్రోత్స‌హించ‌డం నేర్చుకోవాల‌ని చెప్పారు. 

వార‌ణాసిలో శుక్ర‌వారం అఖిల భార‌త మేయ‌ర్ల స‌ద‌స్సును ప్ర‌ధాని మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. దాదాపు 120 మంది మేయర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ స‌ద‌స్సులో పాల్గొన్న మేయ‌ర్లు త‌మ న‌గ‌రాల అభివృద్ధి కోసం ఏ చిన్న అవ‌కాశాన్నీ జార‌విడుచుకోర‌నే విశ్వాసం త‌న‌కున్న‌ద‌ని ప్రధాని పేర్కొన్నారు. 

మ‌నం మ‌న చారిత్రక వార‌సత్వ క‌ట్ట‌డాల‌కు పున‌రుత్తేజం క‌ల్పించాల‌ని ఈ సందర్భంగా ప్రధాని మార్గనిర్ధేశం చేశారు.  ఓ నగరానికి గుర్తింపుగా మారగలవో ఇటువంటి ప్రదేశాలను చూసి తెలుసుకోవచ్చునని చెప్పారు.  నగరాల అభివృద్ధికి ఉన్న ప్రతి అవకాశాన్నీ మేయర్లు సద్వినియోగం చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.

మేయర్లు తమ నగరం అభివృద్ధి చెందడానికి, భవిష్యత్తు మెరుగుపడటానికి వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోరాదని తెలిపారు. మన దేశానికి నేడు విప్లవం అక్కర్లేదని, క్రమవికాసాన్ని, పరిణామాన్ని మనం విశ్వసించాలని చెప్పారు. మన వారసత్వ కట్టడాలను కూల్చేసి, పునర్నిర్మించవలసిన అవసరం లేదని, వాటికి కొత్త శక్తిని అందించి, పునరుజ్జీవింపజేయాలని తెలిపారు.

అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తమ నగరాలను అగ్ర స్థానంలో నిలిపేందుకు మేయర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్యాన్ని వార్షిక కార్యక్రమంగా పరిగణించకూడదన్నారు. వార్డుల్లో ప్రతి నెలా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందేమో చూడాలని కోరారు. అత్యంత సుందరమైన వార్డును ఎంపిక చేయడం కోసం పోటీ పడాలని చెప్పారు. 

మేయ‌ర్ల స‌దస్సులో ప్రారంభోప‌న్యాసం చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కాశీ అభివృద్ధిని ప్ర‌స్తుతించారు. గ‌త ఏడేండ్లుగా అభివృద్ధిలో కాశీ కొత్త‌పుంత‌లు తొక్కుతోంద‌ని చెప్పుకొచ్చారు. కాశీ ప్రాచీన సంస్కృతిని కాపాడుతూనే పురాతన న‌గ‌రాన్ని కొత్త రూపంలో ప్ర‌పంచం ముందు ఆవిష్క‌రించామ‌ని యోగి ఆదిత్యానాధ్ పేర్కొన్నారు.