తగ్గిపోతున్న పాత్రికేయ విలువలు, ప్రమాణాలు

పాత్రికేయ విలువలు, ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, కొంతకాలంగా ఈ మార్పు చాలా స్పష్టంగా కనబడుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ విలువలు మరింత దిగజారకుండా జాగ్రత్త వహిస్తూ ఉన్నతమైన ప్రమాణాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెబుతూ ప్రచార, ప్రసార మాధ్యమాలతో అనుసంధానమై ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దిశగా బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మాధ్యమాల్లో మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో అర్థసత్యాలు, తప్పుడు సమాచారం వంటి వాటికి ప్రాధాన్యత పెరిగిపోతున్న సమయంలో.. వీలైనంత త్వరగా ఈ విషయంపై ఆలోచన చేసి ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభాన్ని పటిష్టపరుచుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. 

 ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ‘కేరళీయం- వీకే మాధవన్ కుట్టి పురస్కారం – 2020’ అవార్డు ప్రదానోత్సవంలో నలుగురు పాత్రికేయులకు వేర్వేరు విభాగాల్లో అవార్డులు అందజేస్తూ వార్తలను యథాతథంగా అందజేసి ప్రజలకే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. 

వార్తలకు ఆయా ప్రచార, ప్రసార మాధ్యమాలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను జోడించకూడదని హితవు చెప్పారు. వాస్తవాలను, వ్యక్తిగత అభిప్రాయాలను ఒకదానితో మరొకటి జోడించకూడదని ఆయన సూచించారు. పాత్రికేయులు తటస్థంగా ఉంటూ వార్తలను యధాతథంగా అందజేయడం అత్యంత అవసరమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

‘దురదృష్టవశాత్తూ కొంతకాలంగా పాత్రికేయ విలువలు మరుగున పడిపోతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. నేటి పరిస్థితుల్లో ఏదైనా ఒక ఘటనపై వాస్తవాలు తెలుసుకోవాలంటే కనీసం నాలుగైదు పత్రికలను చదవాల్సి వస్తోంది. ఒక పత్రికో, ఒక చానల్లో వస్తున్న వార్తపైనో పూర్తిగా ఆధారపడే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితులు మారాలి’ అని ఉపరాష్ట్రపతి సూచించారు. 

ఇలాంటి పరిస్థితుల కారణంగా ప్రజాస్వామ్యపు నాలుగో మూల స్తంభంతోపాటు ప్రజాస్వామ్యానికే ఇబ్బందులు తలెత్తుతాయనే విషయాన్ని మరవొద్దని హితవు చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, వారిలో వివిధ విషయాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మీడియా సంస్థలపైనే ఉందని స్పష్టం చేశారు.

ప్రభుత్వాలు చేసే తప్పొప్పులను సమర్థవంతంగా, పక్షపాతం లేకుండా, నిర్మాణాత్మకంగా విమర్శించాలని మీడియాకు ఉపరాష్ట్రపతి సూచించారు. అయితే, పాత్రికేయతలో వాణిజ్య పరమైన ఆసక్తులు చొరబడితే ప్రజాస్వామ్యానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మీడియా సంస్థలు స్వతంత్రంగా ఉండటం, తటస్థంగా ఉండటం అత్యంత అవసరమని స్పష్టం చేస్తూ భారతదేశానికి స్వాతంత్య్రం  సిద్ధించడంలో పత్రికలు పోషించిన అర్థవంతమైన పాత్రను మరిచిపోవద్దని ఉపరాష్ట్రపతి సూచించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి  వి.మురళీధరన్, కేరళీయం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు  పీవీ అబ్దుల్ వాహబ్ తదితులు పాల్గొన్నారు.