2025 కల్లా క్షయ వ్యాధి నిర్ములించాలి

వచ్చే మూడేండ్లలో భారతదేశం నుంచి క్షయవ్యాధిని నిర్మూలించేందుకు సమాజమంతా ఏకతాటిపైకి వచ్చి కీలక పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. ఇందుకోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ‘ఉమెన్ విన్నింగ్ అగెనెస్ట్ టీబీ’ జాతీయ సదస్సులో  ముఖ్య అతిథిగా పాల్గొంటూ  మానసిక దృఢత్వం, క్రమశిక్షణతోపాటు నిపుణుల సలహాలను నిరంతరం పాటించడం ద్వారా ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనవచ్చునని చెప్పారు. 

క్షయవ్యాధి బారిన పడుతున్నవారిలో మహిళలే ఎక్కువగా ఉండటంపై వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ చేయడం ద్వారా వారిలో మానసిక స్థైర్యాన్ని కల్పించాలని ఆయన సూచించారు. పౌష్టికాహారాన్ని అందించడం, క్షయవ్యాధిగ్రస్తులైన గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం తదితర చర్యల ద్వారా మహిళలను ఈ వ్యాధి బారి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖమంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండావియా, మహిళా, శిశుసంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపరా మహేంద్రభాయ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇందీవర్ పాండే  పాల్గొన్నారు.