దివ్యాంగురాలి పాదాల‌కు మొక్కిన‌ ప్ర‌ధాని మోదీ

వార‌ణాసిలో కాశీ విశ్వ‌నాథ్ కారిడార్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఓ దివ్యాంగురాలి పాదాల‌కు మొక్కి కోట్లాది మంది హృద‌యాలను గెలుచుకున్నారు. 

కాశీలో మోదీ ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలో దివ్యాంగురాలైన శిఖా రాస్తోగి.. ఆయ‌న‌ను క‌లిసేందుకు ముందుకు వ‌చ్చింది. ప్ర‌ధాని మోదీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఆమె ప్ర‌య‌త్నించ‌గా, మోదీనే ఆమె పాదాల‌కు మొక్కారు. ఆమె యోగ క్షేమాల‌ను మోదీ అడిగి తెలుసుకున్నారు.

అక్క‌డే ఉన్న ముఖ్యమంత్రి  యోగి ఆదిత్య‌నాథ్ కూడా శిఖాకు న‌మ‌స్క‌రించి అభినంద‌న‌లు తెలిపారు. ఈ ఫోటోను బీజేపీ మ‌హిళా మోర్చా జాతీయ అధ్య‌క్షురాలు వాన‌తి శ్రీనివాస‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసి, ఇది మ‌హిళా శ‌క్తికి గౌర‌వం అని ట్యాగ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ప్ర‌కృతి సేద్యాన్ని ఉద్య‌మంలా చేప‌ట్టండి
 
స‌హ‌జ రీతిలో వ్య‌వ‌సాయాన్ని ఓ ఉద్య‌మంలా చేప‌ట్టేందుకు అన్ని రాష్ట్రాలు ముందుకు రావాల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.  ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ జాతీయ స‌ద‌స్సులో పాల్గొంటూ ప్ర‌కృతి సేద్యం వ‌ల్ల దేశంలోని 80 శాతం చిన్న త‌ర‌హా రైతులకు లాభం చేకూరుతుంద‌ని పేర్కొన్నారు. 
 
స‌న్న‌కారు రైతుల‌కు రెండు ఎకరాల క‌న్నా త‌క్కువ భూమి ఉంటుంద‌ని, వాళ్లు ఎక్కువ శాతం ర‌సాయ‌నాల‌పై ఖ‌ర్చు చేస్తుంటార‌ని ప్రధాని గుర్తు చేశారు. స‌హ‌జ‌సిద్ద‌మైన ఫెర్టిలైజ‌ర్లు వాడ‌డం వ‌ల్ల ప్రయోజనం ఎక్కువ‌గా ఉంటుంద‌ని మోదీ తెలిపారు. 
 
వ్యవ‌సాయ రంగంలో ఉన్న సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాని చెప్పారు. పంట వ్య‌ర్ధాల‌ను కాల్చ‌డం వ‌ల్ల భూసారాన్ని కోల్పోతామ‌ని నిపుణులు చెబుతున్నార‌ని, కానీ పంట వ్య‌ర్ధాల‌ను కాల్చ‌డం ఓ సాంప్ర‌దాయం అయిపోయింద‌ని ప్ర‌ధాని వెల్ల‌డించారు. 
 
కెమిస్ట్రీ ల్యాబ్‌ల నుంచి సేద్యాన్ని దూరం చేయాల‌ని, సాగును స‌హ‌జ ల్యాబ‌రేట‌రీకి త‌ర‌లించాల‌ని ప్రధాని స్పష్టం చేశారు. స‌హ‌జ‌మైన ల్యాబ్ అంటే సైన్స్ ఆధారిత‌మైంద‌ని, విత్త‌నాల నుంచి నేల వ‌ర‌కు.. అన్నింటికీ స‌హ‌జ రీతిలో ప‌రిష్కారాలు దొరుకుతాయ‌ని మోదీ తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్‌, నేచుర‌ల్ ఫార్మింగ్ లాంటి అంశాలు వ్య‌వ‌సాయ రంగాన్ని మార్చేస్తుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

విదేశాల నుంచి ఎరువులను దిగుమతి చేసుకోవలసి వస్తోందని, దీనివల్ల సాగు ఖర్చులు పెరుగుతున్నాయని, అందువల్ల ప్రకృతి సహజ సాగు విధానాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. సాగును రసాయన ప్రయోగశాల నుంచి బయటకు తేవాలని, ప్రకృతికిగల సొంత ప్రయోగశాలకు అనుసంధానం చేయాలని పిలుపునిచ్చారు. ఎరువులకు ఎలాంటి శక్తి ఉందో, దానిని ప్రకృతి నుంచి కూడా పొందవచ్చునని చెప్పారు. మనం దానిని తెలుసుకోవాలని చెప్పారు.

గత కొన్ని సంవత్సరాల్లో రైతులు ప్రకృతి సహజ సాగు విధానాలను అవలంబించడం వల్ల వ్యవసాయోత్పత్తులు ఏ విధంగా పెరిగాయో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ చెప్పారని మోదీ తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి ఆధారం సైన్సేనని చెప్పారు. ప్రపంచం సాంకేతికంగా ప్రగతి సాధించినప్పటికీ, ఇది తన మూలాలకు కూడా అనుసంధానమైందన్నారు. దీనిని సాగు రంగంలో కూడా అమలు చేయాలని పిలుపునిచ్చారు.

విత్తనం నుంచి నేల వరకు ప్రతిదాన్నీ సహజమైన రీతిలో చూడవచ్చునని తెలిపారు. ప్రకృతి సహజమైన సాగు విధానంలో ఎరువులు, పురుగు మందుల కోసం ఖర్చు చేయవలసిన అవసరం ఉండదని చెప్పారు. ఈ విధానంలో సాగునీటి అవసరం కూడా తగ్గుతుందన్నారు. వరదలు, కరువుకాటకాలు వంటి విపత్తులను కూడా ఎదుర్కొనే సత్తా లభిస్తుందని చెప్పారు. భారతీయ రైతులు స్వయం సమృద్ధమయ్యేందుకు ఈ విధానం దోహదపడుతుందని వివరించారు.

అంతకుముందు గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మాట్లాడుతూ, వానపాములు, పశువుల పేడ, బెల్లం వంటి సహజ వనరులు ఏ విధంగా భూసారాన్ని పెంచగలవో వివరించారు. భూమిలో పోషక విలువలు పెరగడం వల్ల వ్యవసాయోత్పత్తులు పెరుగుతాయని తెలిపారు.