కర్ణాటకలో మత మార్పిడి నిషేధ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను న్యాయశాఖ సన్నద్ధం చేసింది. మత స్వాతంత్య్ర సంరక్షణ హక్కు చట్టం 2021ని బెళగావిలో జరుగుతున్న శాసనసభ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదించాలని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీ తీరని వారిని, మహిళలు, మానసిక వైకల్యం ఉన్నవారిని బలవంతంగా మతమార్పిడి చేస్తే 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తారు. ఇక ఇతర వర్గాల వారిని బలవంతంగా మత మార్పిడి చేయిస్తే 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తారు.
ఇక సామూహికంగా మత మార్పిడులను చేయిస్తే 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లు వెసలుబాటు కల్పిస్తుంది. ప్రలోభాలకు గురిచేసి రాష్ట్రంలో మత మార్పిడులు చేయిస్తున్నారని ఆరోపణలు వస్తుండడంతో ఈ బిల్లును ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. స్వచ్ఛందంగా మత మార్పిడి చేసుకోవాలనుకునే వారికి కూడా ఈ బిల్లులో వెసలు బాటు కల్పించారు.
కాగా బీజేపీ రహస్య అజెండాలో భాగంగానే ఈ బిల్లును తెస్తున్నారని ప్రతిపక్షాలైన కాంగ్రెస్, జేడీఎస్‌లు విరుచుకుపడ్డాయి. ఈ బిల్లును శాసనసభ ఉభయసభల్లోనూ అడ్డుకుంటామని ప్రకటించాయి. ఈ బిల్లు ఏ మతానికి వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. బలవంతపు మతమార్పిడులను అడ్డుకునేందుకే ఈ బిల్లును తెస్తున్నామని తెలిపారు.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం
సైఫ్ అలీఖాన్పై దాడి చేసిన బంగ్లాదేశ్ వాసి అరెస్ట్!