ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలకు అడ్వాన్స్‌ బుకింగ్‌ ..61 ఒమిక్రాన్ కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్‌ ముప్పును దృష్టిలో పెట్టుకొని రిస్క్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీ పీసీఆర్‌ పరీక్షల కోసం అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది.  దేశవ్యాప్తంగా ఒక్కరోజే 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో నాలుగు కేసులు, మహారాష్ట్రలో మరో 8 కేసులు నిర్ధారణ అయ్యాయి.

దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 61కి చేరింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 28 కేసులు, రాజస్థాన్‌లో 17, ఢిల్లీలో ఆరు, గుజరాత్‌లో 4, కర్ణాటకలో 3, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌లో ఒకటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరోవంక, దేశంలో ఒమిక్రోన్  ముందుస్తుగా బుక్‌ చేసుకోని వారికి సైతం విమానంలోకి ఎక్కేందుకు అనుమతించనున్నారు. 

అయితే, అలాంటి ప్రయాణికులకు పరీక్షలు చేసేందుకు ముందస్తుగా స్లాట్‌ బుక్‌ చేయడం సంబంధిత విమానయాన సంస్థలదే బాధ్యతని స్పష్టం చేసింది.  ఇప్పటికే యూకే ఇలాంటి మార్గదర్శకాలను అమలు చేస్తున్నది. ఈ నిబంధనతో దేశానికి వచ్చే ప్రయాణికులంతా ఆర్టీ పీసీఆర్‌ పరీక్షల కోసం ముందస్తుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంది.

నిబంధనలు పాటించడంలో విఫలమైతే బ్రిటీష్‌ విమానాశ్రయానికి విమానంలో ఎక్కేందుకు అనుమతించడం లేదు.vఈ నిబంధనలు భారత్‌లో ఈ నెల 20 నుంచి అమలులోకి రానున్నది. తొలి దశలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని విమానాశ్రయాలకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రమే వర్తించనున్నది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెమోలో ప్రయాణికులు ‘రిస్క్‌లో ఉన్న’ దేశాల నుంచి వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష చేసుకునేందుకు ముందస్తుగా బుక్‌ చేసుకునేందుకు అనుమతించేలా ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో మార్పులు చేయనున్నట్లు తెలిపింది. 

ముందస్తు బుకింగ్‌, చెల్లింపుల మొదలైన దాంట్లో ఎలాంటి సమస్య లేకుండా చూసేందుకు మొదట ఆరు నగరాల్లో అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. రిస్క్‌ దేశాల జాబితాల్లో దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్‌వానా, చైనా, ఘనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్‌, యూకే సహా యూరిపియన్‌ దేశాలున్నాయి.

 ఒకే రోజు మంగళవారం దేశంలో 16 మందికి పాజిటివ్‌గా తేలింది. మధ్యాహ్నం ఢిల్లీలో నలుగురు, రాజస్థాన్‌లో నలుగురు వేరియంట్‌ బారినపడగా.. తాజాగా మహారాష్ట్రలో ఎనిమిది మందికి పాజిటివ్‌గా గుర్తించారు. ఏడుగురు రోగులు ముంబైకి చెందిన వారు కాగా.. ఒకరు వసాయ్‌ విరార్‌కు చెందిన వ్యక్తి. కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు మహారాష్ట్రలో 28 మంది ఒమిక్రాన్‌ బారినపడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది.

మరో వైపు కరోనా సంబంధిత ప్రోటోకాల్స్‌ను పాటించడంలో నిర్లక్ష్యంపై ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే త్వరగా కరోనా  టీకా తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో నాలుగు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. ఒమిక్రాన్‌ బారినపడ్డ ఓ వ్యక్తి కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పారు.

ఇదిలా ఉండగా విమానం ఎక్కే ముందు తమ ప్రయాణికులు తప్పనిసరిగా ముందస్తు బుకింగ్‌ను తనిఖీ చేయాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ సూచించింది.

మరోవంక,  కర్ణాటకలో నకిలీ ఆర్టీ పీసీఆర్‌ సర్టిఫికెట్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వ్యక్తికి నకిలీ సర్టిఫికెట్ జారీ చేయడంతో అతను దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. కర్ణాటక పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. 

బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు సహా ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లోని ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.