
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో రైతులపై జరిగిన హింసాకాండ.. ప్రణాళికాబద్ధమైన కుట్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. నిర్లక్ష్యం కారణంగా రైతులు మరణించలేదని, ఉద్దేశపూర్వకంగా హత్యకు ప్రణాళికలు రచించారని తెలిపింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఆశిశ్ మిశ్రా, ఇతరులపై హత్య, కుట్రకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి.
ఆశిశ్ మిశ్రాపై నమోదైన అభియోగాలను సవరించాలని ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న అధికారులు న్యాయమూర్తికి లేఖ రాశారు. వాటితో పాటు హత్యా ప్రయత్నం, ఉద్దేశపూర్వకంగా రైతులను గాయపరచడం అభియోగాలను కూడా చేర్చాలని ఆ లేఖలో సిట్ కోరింది.
నిందితులను శిక్షించేందుకు వీలుగా ప్రస్తుత కేసులో అదనపు సెక్షన్లను చేర్చాలని కోరింది. ఐపిసి లోని సెక్షన్లు 279, 338, 304ఏలను మార్చాలని కోరింది. ఈ మేరకు సిట్ దర్యాప్తు అధికారి విద్యారామ్ దివాకర్ సిజెఎంకు దరఖాస్తు సమర్పించారు. ఈ సంఘటన ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా జరిగిందని తెలిపారు.
లఖింపూర్ ఖేరిలో అక్టోబర్ 3న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌మిశ్రా కారుతో తొక్కించిన ఘటన దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో రైతులపైకి ఎస్‌యువి వాహనం వేగంగా దూసుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనపై రైతులు సహా ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కేసు విచారణపై సుప్రీంకోర్టు కూడా యుపి ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణను వేగవంతం చేసేందుకు గత నెల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ఆదేశించింది.
కాగా, లఖింపూర్ ఖేరీ ఘటనలో కేంద్రమంత్రి కొడుకు అశీశ్ మిశ్రాపైన, అతని సహనిందితుపైన ఇప్పటికే హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం వాటితోపాటు హత్యాయత్నం, ఇతర అభియోగాలను కూడా చేర్చనున్నట్లు సిట్ పేర్కొన్నది.
More Stories
శబరిమల సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ తొలగింపు
రెండు రోజుల్లో భూమిపైనే అత్యంత తెలివైన ఎఐ గ్రోక్ 3
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటలో 18 మంది మృతి