ఛార్‌థామ్ రోడ్ల విస్త‌ర‌ణ‌కు `సుప్రీం’ గ్రీన్ సిగ్న‌ల్‌

ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా చేప‌డుతున్న రోడ్ల విస్త‌ర‌ణ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. జాతీయ భ‌ద్ర‌త దృష్ట్యా ఛార్‌ధామ్ ప్రాజెక్టుకు సంబంధించిన రోడ్ల విస్త‌ర‌ణ అవ‌స‌ర‌మ‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. 
 
జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ సూర్య కాంత్‌, జ‌స్టిస్ విక్ర‌మ్ నాథ్‌ల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఇవాళ ఈ కేసును విచారించింది. రోడ్ల విస్త‌ర్ణ వ్యూహాత్మ‌క అవ‌స‌రంగా మారుతుంద‌ని చేసిన వాద‌న‌లు కోర్టు ఆమోదించింది. బోర్డ‌ర్ సెక్యూర్టీ అవ‌స‌రాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు అవ‌స‌ర‌మ‌ని చెప్పిన కేంద్రానికి కోర్టు ఓకే అన్న‌ది. 
 
ర‌క్ష‌ణ‌శాఖ చాలా ప్ర‌త్యేక‌మైన శాఖ అని, త‌మ‌కు అవ‌స‌ర‌మైన విధానాల‌ను ఆ శాఖే రూపొందించుకోవ‌చ్చు అని కోర్టు తెలిపింది. ద‌ళాలు, ఆయుధాల త‌ర‌లింపు చాలా అవ‌స‌ర‌మ‌ని, ఇటీవ‌ల జాతి భ‌ద్ర‌త దృష్ట్యా ఎదురైన స‌వాళ్ల‌ను దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్త‌ర‌ణ‌కు ఓకే చెప్పాల్సిందే అని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. 
 
ముఖ్యంగా చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెరుగుతున్న ఉద్రిక్తతలను కోర్ట్ పరిగణలోకి తీసుకొంది. సైనిక బ‌ల‌గాలకు మౌళిక స‌దుపాయాలు క‌ల్పించాల‌ని, దాని వ‌ల్ల‌ స‌రిహ‌ద్దుల ర‌క్ష‌ణ పెరుగుతుంద‌ని కోర్టు తెలిపింది. ఉత్త‌రాఖండ్‌లోని గంగోత్రి, య‌మునోత్రి, కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్ క్షేత్రాల‌ను ఛార్‌థామ్ అంటారు. ఈ రూట్లో రోడ్ల విస్త‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు.
కాగా,  పిటిషనర్, గ్రీన్ డూన్ కోసం ఎన్‌జిఓ సిటిజన్స్ లేవనెత్తిన పర్యావరణ ఆందోళనలను కూడా బెంచ్ పరిగణలోకి తీసుకొంది.  నిర్మాణ సమయంలో కొన్ని చోట్ల ప్రభుత్వం ఉత్తమ విధానాలను అవలంబించలేదని కోర్టు నియమించిన హై పవర్డ్ కమిటీ పరిశీలనలను ప్రస్తావించింది.


ఈ సిఫార్సులను అనుసరించాలని పేర్కొంటూ, అమలును పర్యవేక్షించడానికి, ఉల్లంఘనలు లేవని నిర్ధారించడానికి కోర్టు తన మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎకె సిక్రీ నేతృత్వంలోని పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.