భారత్ హైపర్‌సోనిక్ క్షిపణిలు అభివృద్ధి చేయాలి

చైనా హైపర్‌సోనిక్ క్షిపణిలను పరీక్షించిందని నివేదికలు కొద్దీ నెలల క్రితం దృష్ట్యా భారత్ కూడా పొరుగుదేశం నుండి ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడం కోసం అటువంటి క్షీపణిలను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని శాస్త్రవేత్తలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు.
ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని దేశాలకు మాత్రమే అందుబాటులో ఉన్న సముచిత రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేయాలని భారత్ ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
 
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ  (డిఆర్‌డిఓ) భవన్‌లో ‘ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో సింగ్ మాట్లాడుతూ, దేశంలోని ప్రీమియర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ సాధించిన విజయాలు ఏదైనా టెక్నాలజీ అభివృద్ధిలో పూర్తిగా విజయవంతమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

“రక్షణ సాంకేతికతలో భారతదేశం అగ్రగామిగా ఎదగాలి.  ఇది మన  అతిపెద్ద ప్రయత్నం. . మనల్ని మనం తయారు చేసుకోగలిగిన సాంకేతికతలు ఇప్పుడు మన స్వంతం. అదే సమయంలో, ఈ రోజు కొన్ని ఎంపిక చేసిన దేశాలతో మాత్రమే ఉన్న సాంకేతికతలను మనం స్వదేశీీకరించాలి” అని రక్షణ మంత్రి చెప్పారు.

ఉదాహరణకు, బాలిస్టిక్ క్షిపణి రక్షణ రోజురోజుకు మరింత పటిష్టంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.  మన కనీస విశ్వసనీయమైన నిరోధాన్ని కొనసాగించడానికి, హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల అభివృద్ధి గురించి మనం త్వరగా ఆలోచించాలని స్పష్టం చేశారు. ఇది మన రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పు అవుతుందని అంటూ   దీని కోసం మనమందరం కలిసి పని చేయాలని పిలుపిచ్చారు.

“కాలం మారుతున్న కొద్దీ మన రక్షణ అవసరాలు కూడా మారుతున్నాయి. నేడు సాంకేతికత అనే మరో యోధుడు యుద్ధభూమికి వచ్చాడు. సైబర్, స్పేస్, ఐటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనాలిసిస్ వంటి కొత్త టెక్నాలజీలు ప్రతిరోజూ వార్‌ఫేర్‌లో కొత్త అధ్యాయాలను జోడిస్తున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.

సాయుధ బలగాలు, డిఆర్‌డిఓ, విద్యాసంస్థలు,   ప్రైవేట్ పరిశ్రమల మధ్య సమన్వయంతో దేశం “మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా తయారు చేయాలనే లక్ష్యాన్ని సాధించగలుగుతుందని రక్షణ మంత్రి భరోసా వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నాలు “మన సామర్థ్యాలను పెంచుతాయి” అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 సాయుధ దళాలు, భవిష్యత్తు యుద్ధానికి దేశాన్ని పూర్తిగా సిద్ధం చేయండని ఆయన పిలుపిచ్చారు. గత వారం హెలికాప్టర్ ప్రమాదంలో తన భార్యతో పాటు మరో 11 మంది సైనిక సిబ్బంది మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌కు సింగ్ ఈ  సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. 
 
సిడిఎస్‌ పోస్టును ఏర్పాటు చేయడంతో పాటు సైనిక వ్యవహారాల శాఖను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం మూడు సర్వీసుల అనుసంధానం, ఆధునీకరణ ప్రక్రియను ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. 
 
ఇటువంటి ప్రయత్నాలు నిరంతరాయంగా ముందుకు సాగుతాయని చెబుతూ వీలైనంత త్వరగా ఈ లక్ష్యాన్ని సాధించడంకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. తొలుత,  సింగ్  డిఆర్‌డిఓ అభివృద్ధి చేసిన ఐదు ఉత్పత్తులను సాయుధ దళాలకు,  ఇతర భద్రతా సంస్థలకు అందజేశారు. 
 
ఉత్పత్తులలో ఇన్‌కమింగ్ డ్రోన్‌లను గుర్తించడం, నిరోధించడం,  నాశనం చేయడం కోసం కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌లు ఉన్నాయి.  మాడ్యులర్ బ్రిడ్జ్ టెక్నాలజీ, స్మార్ట్ యాంటీ-ఎయిర్‌ఫీల్డ్ వెపన్, చాఫ్ వేరియంట్‌లు,  తేలికపాటి ఫైర్ ఫైటింగ్ సూట్‌లను సేవలకు అందజేశారు.