కర్ణాటక శాసనమండలిలో ఆధిక్యత సాధించిన బిజెపి

కర్ణాటక శాసన మండలిలో 25 స్థానాలకు జరిగిన ఎన్నికలలో 12 స్థానాలు గెల్చుకోవడం ద్వారా 75 మంది సభ్యులున్న మండలిలో తన బలాన్ని 38కి పెంచుకోవడం ద్వారా బిజెపి సొంతంగా ఆధిక్యత సాధించుకో గలిగింది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బలపరిక్షగా జరిగిన ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 11 సీట్లు గెల్చుకోగా, జేడీఎస్ కేవలం 1 సీట్ మాత్రమే గెల్చుకొని చతికిల పడింది. 

మాజీ ప్రధాని జెడి దేవెగౌడ మనుమడు సూరజ్ రావన్న మాత్రం హస్సన్ నుండి మంచి మెజారిటీతో గెలుపొంద గలిగారు. స్థానిక సంస్థల నుండి ఈ నెల 10న జరిగిన ఈ ఎన్నికల ఓట్లను మంగళవారం లెక్కించారు. ఎన్నికలు జరిగిన 25 సీట్లలో ఇంతకు ముందు కాంగ్రెస్ 14, బిజెపి 7, జేడీఎస్ 4 సీట్లలో ఉండెడివి. 

బెలగావి నుంచి స్వతంత్ర అభ్యర్థి లఖన్ జార్కిహోళి విజయం సాధించ గా,ఇక్కడ  బీజేపీ మూడో స్థానానికి పరిమితమైనది. అతను బిజెపి నేత రమేష్ జార్కిహోళి సోదరుడు. తమకు రెండంకెల సీట్లు గెల్చుకోవడం పట్ల ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. 

పోలింగ్ సందర్భంగా దాదాపు 99 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 90 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, వారిలో 20 మంది బిజెపి,  కాంగ్రెస్ నుండి, ఆరుగురు జెడిఎస్, 33 మంది స్వతంత్రులు, మిగిలినవారు చిన్న పార్టీల నుండి ఉన్నారు.

ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా హవేరీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలలో హంగల్ సీటును కోల్పోయిన తర్వాత ఈ ఎన్నికల్లో విశేషమైన ప్రదర్శన పార్టీకి నైతిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలో వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరవుతున్న ఉన్న బొమ్మై బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని ముందుగానే విశ్వాసం వ్యక్తం చేశారు.

చాలా ఏళ్ళ తర్వాత శాసన మండలిలో బిజెపికి ఆధిక్యత లభించడం పట్ల హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర హర్షం వ్యక్తం చేశారు. మండలిలో బీజేపీ మరింత బలం పుంజుకోవడంతో    ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త కార్యక్రమాలు, చట్టాలను తీసుకురాగలదని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వంత్‌నారాయణ పేర్కొన్నారు. ఇది ప్రజానుకూలమైన పరిపాలనను అందించేందుకు ప్రభుత్వానికి మరింత బలం చేకూరుస్తుందని ఆయన తెలిపారు.