హిందుత్వానికి ప్రతీకగా అయోధ్య రామమందిరం 

అయోధ్య నగరంలో నిర్మిస్తున్న రామ మందిరం హిందుత్వానికి ప్రతీకగా నిలుస్తుందని  విశ్వ హిందూ పరిషద్ (విహెచ్‌పీ) అధ్యక్షుడు రబీంద్ర నారాయణ్‌ సింగ్‌ తెలిపారు. రామజన్మ భూమిని వాటికన్‌ సిటీ, మక్కా తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. 

నాగ్‌పూర్‌ ధంతోలిలో విశ్వహిందూ జనకళ్యాణ పరిషత్ విదర్భ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న సాధువులు, వీహెచ్‌పీ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. అయోధ్యలోని రామజన్మభూమి తీర్థయాత్ర ప్రాంతాన్ని వాటికన్ సిటీ, మక్కా తరహాలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

మోదీ ప్రభుత్వం దేశంలో మతమార్పిడులకు విదేశీ నిధులపై విరుచుకుపడుతోందంటూ ఆయన కొనియాడారు. దేశానికి సేవ చేసేందుకు హిందువులతో చేతులు కలపాలని ముస్లిం సమాజానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 

‘హిందువులు తమకు ఏమీ జరగదని అనుకుంటారు. ఈ మనస్తత్వం వల్ల మనం సవాళ్లను ఎదుర్కొంటున్నాం. గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడి చేసేందుకు క్రిస్టియన్ మిషనరీలు ఆయా ప్రాంతాల్లో ఆసుపత్రులు, పాఠశాలలు నిర్వహిస్తున్నాయి’ అంటూ ఆరోపించారు.

హిందూ మతాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు మిషనరీలు పూర్తి ప్రణాళికతో ఈ పని చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ రోజుల్లో భారతదేశ ప్రజలు తమ పిల్లల్లో ‘సంస్కారం, సద్గుణాలు’ పెంపొందించుకోవడం కంటే జీడీపీపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని  విచారం వ్యక్తంచేశారు. విదర్భ, తూర్పు మహారాష్ట్రలోని హిందువుల సంక్షేమం కోసం జన్ కళ్యాణ్ పరిషత్ పలు పథకాలను ప్రారంభిస్తుందని ఆయన వివరించారు.