మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్‌ సంధు

మిస్‌ యూనివర్స్‌  కిరీటాన్ని భారత యువతి సొంతం చేసుకున్నది. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న 70వ మిస్‌ యూనివర్స్‌-2021 పోటీల్లో పంజాబ్‌కు చెందిన 21 ఏండ్ల హర్నాజ్‌ కౌర్‌ సంధు టైటిల్‌ను గెలుపొందింది. దీంతో 21 ఏండ్ల తర్వాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కినట్లయింది.

మొదటిసారిగా 1994లో సుస్మితా సేన్‌ విశ్వ సుందరి కిరీటాన్ని ధరించింది. తర్వాత 2000 సంవత్సరంలో లారాదత్తా ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్నది. మళ్లీ సరిగ్గా 21 ఏండ్ల తర్వాత అందులోనూ 2021లో 21 ఏండ్ల హర్నాజ్‌ సంధుకు ఈ కిరీటం దక్కడం విశేషం.

ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన ఈ పోటీలో పరాగ్వే, దక్షిణాఫ్రికాకు చెందిన యువతులతో హర్నాజ్ సంధు పోటీపడింది. వారిపై నెగ్గిన హర్నాజ్‌కు మెక్సికోకు చెందిన మాజీ మిస్ యూనివర్స్ 2020 ఆండ్రియా మెజా మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని ధరింపజేసింది.

ఇవాళ్టి రోజుల్లో యువతులకు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను ఎలా డీల్ చేస్తారని నిర్వాహకులు హర్నాజ్ కు ప్రశ్న అడిగారు. దీనికి హర్నాజ్ చాలా తెలివిగా అద్భుతమైన సమాధానం చెప్పడంతో నిర్వాహకులను ఆకట్టుకున్నారు. యువత ఇతరులతో పోల్చుకోవడాన్ని ఆపాలని, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించాలని ఆమె చెప్పారు. 

“మీ జీవితానికి మీరే నాయకులు, మీకోసం మీరు మాట్లాడేందుకు బయటకు రావాలి” అంటూ ఆమె యువతకు పిలుపునిచ్చారు. తన వరకు తాను ఇది నమ్ముతానని అందుకే ఈ వేదిక పైఇంత వరకు వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.  తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయాలంటూ మరోశక్తివంతమైన జవాబు ఇచ్చి ఆమె ఆకట్టుకుంది. 

పంజాబ్ రాజ‌ధాని చండీగ‌ఢ్‌కు చెందిన హ‌ర్నాజ్ సంధు వృత్తిప‌రంగా ఒక‌ మోడ‌ల్. చండీగ‌ఢ్‌లోనే డిగ్రీ పూర్తి చేసిన హ‌ర్నాజ్ ప్ర‌స్తుతం మాస్ట‌ర్స్ కూడా చ‌దువుకుంటోంది. ఒక‌వైపు బ్యూటీ కాంటెస్ట్‌ల‌లో పాల్గొంటూ.. మ‌రోవైపు చ‌దువుని కొన‌సాగిస్తోంది. అంతేకాదు రెండు పంజాబీ సినిమాల‌లో కూడా న‌టించింది.

17 ఏళ్ల వ‌య‌సు నుంచే మోడ‌లింగ్ ప్రారంభించిన హ‌ర్నాజ్ ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు బ్యూటీ కాంటెస్ట్‌ల‌లో విన్న‌ర్‌గా నిలిచింది. 2017లో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ మిస్ చండీగ‌ఢ్, 2018లో మిస్ మ్యాక్స్ ఎమ‌ర్జింగ్ స్టార్, 2019లో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్, 2021 లో మిస్ యూనివ‌ర్స్ ఇండియా కితాబుల‌ను అందుకుంది.

స్కూల్ చ‌దువుకునే రోజుల‌లో హ‌ర్నాజ్ చాలా స‌న్నగా ఉండ‌డంతో తోటి విద్యార్థులు ఆమెను ఏడ్పించేవారు. దీంతో కొంత‌కాలం ఆమె డిప్రెష‌న్ బారిన‌ప‌డింది. ఆ స‌మ‌యంలో హ‌ర్నాజ్ కుటుంబం తోడుగా నిల‌బ‌డ‌డంతో ఆమె త్వ‌ర‌గా కోలుకొంది. మోడ‌లింగ్, అందాల‌పోటీల‌లో ఇప్ప‌టివ‌ర‌కు విజేత‌గా నిలిచిన ఈ అందాల భామ డైటింగ్ చేయ‌నంటోంది. నోటికి రుచిగా ఉండేవి అన్నీతింటాన‌ని చెప్పింది. కానీ రోజూ వ‌ర్కౌట్స్ త‌ప్ప‌నిస‌రి అని చెప్పుకొచ్చింది.