శ్రీనగర్‌లో పోలీసుల బస్సుపై కాల్పులు..ముగ్గురు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీనగర్‌ శివారులో పోలీసుల బస్సుపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 14 మంది పోలీసులు గాయపడగా, వారిలో చికిత్సపొందుతూ ఒక ఎస్ ఐ, సెలెక్షన్‌ గ్రేడ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందిన్నట్లు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు గత రాత్రి తెలిపారు. కాగా మంగళవారం మరో కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

పాంతాచౌక్‌  దగ్గర జెవాన్‌ ప్రాంతంలోని పోలీస్‌ క్యాంపు సమీపంలోనే పోలీసు బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. సోమవారం సాయంత్రం సాయుధ పోలీస్‌ బెటాలియన్‌ బస్సుపై ఉగ్రవాదులు  కాల్పులకు తెగబడినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని  కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఘటనతో  అలర్టైన  బలగాలు పాంతా చౌక్‌లోని జెవాన్‌ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 

కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 ఏళ్ళ క్రితం భారత్ పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడి జరపడం, భద్రతా దళాలు జరిపిన కాల్పులలో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోవడం సంఘటన జరిగిన రోజుననే శ్రీనగర్ లో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పుల వర్షం కురిపించడం గమనార్హం. 

రెండు రోజుల క్రితమే బాండిపొరలో ఇద్దరు పోలీసులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. అంతలోనే ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు ఇటీవల కశ్మీర్ లోయలో పోలీసులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఉగ్రదాడుల్లో 19 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 

శ్రీగర్‌ శివారులో పోలీస్‌ బస్సుపై ఉగ్రవాదుల కాల్పుల ఘటనను కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి  ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు.