కాశీ విశ్వనాథ్ కారిడార్ తో నవ చరిత్ర సృష్టి

ప్రతిష్ఠాత్మక ‘కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు’తో నవ చరిత్ర సృష్టి జరుగనుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మోదీ కలల ప్రాజెక్టుగా మూడేళ్ల వ్యవధిలో పూర్తయిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును సోమవారంనాడు ఆయన ప్రారంభించారు. రూ.399 కోట్ల వ్యయంతో నిర్మించిన కాశీ విశ్వనాథ్ థామ్ ఫేజ్-1ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.

తొలుత ‘హర్ హర్ మహదేవ్’ నినాదంతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పెద్దఎత్తున సాధులు, సంతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు.కాశీ విశ్వనాథ్ ప్రాజెక్టు కారిడార్ నిర్మాణంతో వయోవృద్ధులు, దివ్యాంగులు సైతం జెట్టీలు, ఎస్కలేటర్లలో ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడానికి మార్గం సుగమమైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

వారు నేరుగా ఘాట్ నుంచి జెట్టీలో ఆలయానికి చేరుకోవచ్చని చెప్పారు. ఎస్కలేటర్‌ ద్వారా కూడా ఘాట్ చేరుకోవచ్చని చెప్పారు.  కరోనా  మహమ్మారి వెంటాడినా నిర్దేశిత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అహరహం శ్రమించిన వర్కర్లకు, కారిడార్‌ కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, యూపీ సర్కార్‌కు అభినందనలు తెలిపారు.

కాశీలో ప్ర‌తి రాయి శివుడే.. కాశీకి సేవ చేయ‌డం అనంతం.. కాశీ.. భార‌త సంస్కృతిక రాజ‌ధాని అని మోదీ చెప్పారు. ప్రాచీన‌, ఆధునిక‌త‌కు కాశీ కేంద్రంగా నిలుస్తోంద‌ని పేర్కొంటూ ప్ర‌తి భార‌తీయుడి త‌న‌కు శివుడి అంశ‌మే అని ప్రధాని స్పష్టం చేసారు. ద‌క్షిణ భార‌త దేశం కాశీ క్షేత్ర ఆన‌వాళ్ల‌ను ఆదిరిస్తుంద‌ని ప్రధాని చెప్పారు. 

అంద‌రికీ కాశీ విశ్వ‌నాథుడి ఆశీస్సులు ఉండాల‌ని చెబుతూ  భార‌తీయ స‌నాత‌న సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక వారణాసి అని పేర్కొన్నారు. భార‌త్‌లో భ‌క్తిని ఢీకొనే శ‌క్తి దేనికీ లేద‌ని ప్రధాని స్పష్టం చేశారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని తెలిపారు. 

 నేటి భార‌త్.. కోల్పోయిన వైభ‌వాన్ని అందుకుంటోంద‌ని చెబుతూ చోరీకి గురైన అన్న‌పూర్ణ విగ్ర‌హం మ‌ళ్లీ వందేళ్ల త‌ర్వాత భారత్ కు   వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. దేశం కోసం మీరంతా మూడు సంక‌ల్పాలు తీసుకోవాల‌ని కోరుతూ స్వ‌చ్ఛ‌త‌, సృజ‌న్‌, ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ కోసం నిరంత‌రం ప్ర‌య‌త్నం చేశాల‌ని మోదీ ఈ సందర్భంగా ఉద్బోధించారు. 

 స్వ‌చ్ఛ‌త జీవ‌న శైలి కావాల‌ని చెబుతూ . దేశం అభివృద్ధి ఎంత సాధించినా.. స్వ‌చ్ఛ‌త చాలా కీల‌కం అని,  ఆత్మ నిర్భ‌ర భార‌త్ చాలా అవ‌స‌రం అని ప్రధాని స్పష్టం చేశారు.  కాశీలో ఏది జ‌రిగినా అది మ‌హాదేవుడి కృప‌తో జ‌రుగుతుంద‌ని ఆయ‌న స్పష్టం చేశారు.

ఇక్క‌డ కేవ‌లం ఢ‌మ‌రుక స‌ర్కార్ ఉంటుంద‌ని, అయోధ్య‌లో రామ మందిర‌మే కాదు.. వైద్య కాలేజీల‌ను కూడా  నిర్మిస్తున్నామ‌ని పేర్కొన్నారు. విశ్వ‌నాథుడి జీర్ణోద్ద‌ర‌ణ మాత్ర‌మే కాదు.. అంత‌రిక్ష రంగంలోనూ భారత్ వైభ‌వంగా వెలుగుతోంద‌ని ప్రధాని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మాగాంధీ వందేళ్ల క్రితం వారణాసి వచ్చారని, అక్కడ ఇరుకు వీదులు, రోడ్లు, అపరిశుభ్ర వాతావరణం చూసి ఎంతో ఆవేదన చెందారని చెప్పారు. గాంధీజీ పేరుతో చాలా మంది అధికారంలోకి వచ్చారని, అయితే భవ్య కాశీ నిర్మాణంతో తొలిసారిగా ఆయన కల ఇన్నేళ్లకు సాకారమైందని సంతోషం వ్యక్తం చేశారు. 

పారిశుద్ధ్య కార్మికుల‌పై పూల వ‌ర్షం

కాశీ విశ్వ‌నాథ ఆల‌యంలో పారిశుద్ధ్య కార్మికుల‌పై ప్రధాని పూల వ‌ర్షం కురిపించారు. ప్ర‌తి ఒక్క కార్మికుడిపై పూలు చ‌ల్లేందుకు ఆ ప్రాంగ‌ణ‌మంతా మోదీ క‌లియ‌తిరిగారు. ఈ సంద‌ర్భంగా కొంత‌మంది కార్మికుల‌ను మోదీ ఆప్యాయంగా ప‌లుక‌రించి, ముచ్చ‌టించారు. కార్మికుల‌పై పూలు చ‌ల్లిన అనంత‌రం అంద‌రితో క‌లిసి మోదీ ఫోటో దిగారు. 

దీంతో కార్మికులు ఆనందం వ్య‌క్తం చేశారు. మోదీ పూలు చ‌ల్లిన స‌మ‌యంలో పారిశుద్ధ్య కార్మికులు హ‌ర హ‌ర మ‌హదేవ అని నిన‌దించారు. ఈ కార్య‌క్ర‌మం కంటే ముందు కాశీ విశ్వ‌నాథుడికి ప్ర‌ధాని మోదీ ఇవాళ జ‌లాభిషేకం చేశారు. గంగా న‌దిలో పుణ్య స్నానం చేసి.. ఆ న‌ది జ‌లంతో విశ్వ‌నాథుడి వ‌ద్ద‌కు వెళ్లి అభిషేకం చేశారు.

ఈ సంద‌ర్భంలో ఆల‌య పూజారులు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వ‌హించారు. గంగా న‌ది నుంచి నీటితో ఆల‌యానికి వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీకి స్వాగ‌తం ప‌లికారు. న‌ది నుంచి కొంత దూరం వ‌ర‌కు కారులో వెళ్లి ఆ త‌ర్వాత ఆయ‌న న‌డుచుకూంటూ స్వామివారి స‌న్నిధికి వెళ్లారు. ఇక ఆల‌య ప‌రిస‌రాల్లో డ‌మ‌రుక స్వాగ‌తం ఆక‌ట్టుకున్న‌ది.