పరభాషా వ్యామోహం కరోనా కంటే ప్రమాదకరం

పరభాషా వ్యామోహం కరోనా కంటే ప్రమాదకరమని  ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హెచ్చరించారు. హైదరాబాద్ \లోని తెలుగు యూనివర్సిటీ 36వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ ఇంగ్లీష్ పై మోజు వద్దని, ఒకవేళ పరాయి భాష నేర్చుకున్నా తెలుగును మరవొద్దని హితవు చెప్పారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.
దేశంలో పరిపాలనా భాషలుగా మాతృభాషలే ఉండాలని ఆకాంక్షించారు. పరాయి పాలకులు మన భాష సంస్కృతుల పట్ల ఓ ప్రతికూల భావాన్ని, ఆత్మన్యూనతను మన మనసుల్లో నాటే ప్రయత్నం చేశారన్న ఉపరాష్ట్రపతి, కొందరు నేటికీ వాటిని గుడ్డిగా అనుసరించడం బాధాకరమని పేర్కొన్నారు. 
 
ఈ ఆత్మన్యూనతను వదిలించుకుని భాష సంస్కృతుల గొప్పతనాన్ని ఘనంగా చాటుకోవాలని దిశానిర్దేశం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పడటంతోపాటు, దేశవ్యాప్తంగా భాషాప్రాతిపదికన ఏర్పాటైన రెండో విశ్వవిద్యాలయం కావడం మనందరికీ గర్వకారణమని కొనియాడారు.
తెలుగు భాషాబోధన, పరిశోధన, ప్రచురణ, విస్తరణ సేవ వంటి కార్యక్రమాల ద్వారా తెలుగు భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని, చరిత్రను పరిరక్షించుకుంటున్న విశ్వవిద్యాలయ సంకల్పాన్ని ఆయన అభినందించారు. 
 
‘అసలు విద్యకు, భాషా సంస్కృతులు, కళలకు సంబంధమేంటనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. దేశ నైసర్గిక స్వరూపంలో ఉన్న వైవిధ్యం కారణంగా భిన్న ప్రాంతాలకు చెందిన ప్రజల ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. వాటి ప్రభావం సంస్కృతి సంప్రదాయాల మీద కూడా ఉంటుంది. అందుకే సంస్కృతిని కాపాడుకోవాలి’ అని ఉపరాష్ట్రపతి సూచించారు. 
 
సంస్కృతి నిలబడాలంటే భాషను, ఆచార వ్యవహారాలను, మన కళలను పరిరక్షించుకోవాలని, కేవలం పరిరక్షించుకోవడమే కాదు, మన ముందు తరాలకు వాటిని సగర్వంగా అందజేయాలని చెప్పారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎల్లలు చెరిగిపోతున్నాయని, ఎల్లలు చెరిగినంత మాత్రాన మన గతమేంటనే విషయాన్ని ఎవ్వరూ మరువ కూడదని తెలిపారు.  

తెలుగు భాషా గ్రంథాలు ఇతర భాషల్లోకి, ఇతర భాషల పుస్తకాలు తెలుగు భాషలోకి అనువాదం విస్తృతంగా జరగాల్సిన అవసరముందన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈ సంకల్పాన్ని కొనసాగిస్తుండాన్ని అభినందించారు. 
తెలుగు ప్రాచీనమైన భాష అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్న ఉపరాష్ట్రపతి, ఆధునిక కాలానికి అనుగుణంగా తెలుగు భాషను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేందుకు కృషిజరగాలని చెప్పారు.
దీంతోపాటు సాంకేతిక పదాలకు సంబంధించిన తెలుగు సమానార్ధక నిఘంటువులను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నూతన జాతీయ విద్యావిధానం మాతృభాషలకు మరింత ప్రాధాన్యత పెంచుతున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయాలన్నీ చొరవ తీసుకుని, ఆయా భాషలకు సంబధించిన సాంకేతిక పదాలతో పుస్తకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పెక్రోన్నారు.
తెలుగు భాష మీద నూతన విధానంలో పరిశోధనలకు చొరవ తీసుకోవాలని, ముఖ్యంగా తెలుగు భాషను ముందు తరాలకు మరింత ఆసక్తికరంగా అందించేందుకు అవసరమైన విధానాల మీద దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ దిశగా సాగే పరిశోధనలకు అవకాశం కల్పించాలని సూచించారు.
తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కవి, విమర్శకుడు డా. కూరెళ్ళ విఠలాచార్య, కూచిపూడి నాట్యాచార్యులు  కళాకృష్ణలకు ఉపరాష్ట్రపతి అవార్డుల ప్రదానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విఠలాచార్య  22 పుస్తకాలను వెలువరించడమే గాక, సుమారు రెండు లక్షల పుస్తకాలతో అందరికీ ఉపయోగపడేలా తమ సొంత ఇంటిలోనే గ్రంథాలయాన్నిఏర్పాటు చేయడంను అభినందించారు.   అలాగే సత్యభామ పాత్రలో ఒదిగిపోయి నటించే కళాకృష్ణ నాట్య, అభినయ పటిమలను కొనియాడారు. 
 
తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధి కోసం చొరవ తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావుకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విధంగా భాష, సంస్కృతి, కళలను కాపాడుకునేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు.

అనంతరం కేంద్ర  సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్ ప్రదర్శనను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా స్వాతంత్రోద్యమంలో దేశభక్తులు చేసిన త్యాగాలు నిరుపమానమైనవని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. వారి త్యాగాల పట్ల ప్రతి భారతీయుడు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలని ఆకాంక్షించారు.