కోహ్లీని తప్పించడంపై బీసీసీఐలో దుమారం!

సారథిగా భారత జట్టుకు ఎన్నో అద్వితీయ విజయాలు అందించిన విరాట్ కోహ్లీని అనూహ్యంగా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడంపై మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడా సంస్థ అయిన బీసీసీఐపై విమర్శలు చెలరేగుతున్నాయి. 

ఇప్పటికే టి20 సారధిగా కోహ్లీని తప్పించి రోహిత్ శర్మను నియమించిన బీసీసీఐ ఇప్పుడు కనీసం లాంఛనంగా ప్రకటన కూడా చేయకుండా ఈ జట్టు సారధిగా కూడా నియమించి, రోహిత్ శర్మను నియమించడం సవ్యంగా జరగలేదనే అభిప్రాయం కలుగుతున్నది.  కనీసం ఆ విషయం అతనికి ముందుగా చెప్పకుండా అర్ధాంతరంగా ప్రకటింప వలసిన అవసరం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

గత కొన్నేండ్లుగా తనదైన శైలిలో జట్టును ముందుండి నడిపిస్తున్న విరాట్‌ కోహ్లీని పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ రోహిత్‌శర్మకు బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. దక్షిణాఫ్రికాలో ఈనెల 26 నుంచి మొదలయ్యే మూడు టెస్టుల సిరీస్‌ కోసం బీసీసీఐ బుధవారం 18 మందితో జట్టును ప్రకటించింది.

 భవిష్యత్‌లో మెగాటోర్నీలను దృష్టిలో పెట్టుకుని రోహిత్‌కు వైట్‌బాల్‌ కెప్టెన్సీని అప్పగించామని, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో 2022 టీ20 ప్రపంచకప్‌తో పాటు స్వదేశం వేదికగా 2023లో వన్డే వరల్డ్‌కప్‌ వరకు హిట్‌మ్యాన్‌ కెప్టెన్‌గా కొనసాగుతాడని బోర్డు ప్రకటించింది.

అగ్రగామి క్రీడాకారులైన సౌరవ్ గంగూలీ, రాహుల్ డేవిడ్, వివిఎస్ లక్ష్మణ్ కీలక నిర్ణయాలు తీసుకొనే స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పకపోయినప్పటికీ,  తీసుకున్న విధానమే విమర్శలకు దారితీస్తుంది. కేవలం ఐసీసీ ట్రోఫీ సాధించలేదనే సాకుతో అవమానకరంగా తప్పించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

టీ20 కెప్టెన్సీని వదులుకొన్న కోహ్లీ.. వన్డే, టెస్ట్‌ల్లో సారథిగానే కొనసాగుతానని స్పష్టం చేశాడు. కానీ, బీసీసీఐ మాత్రం వైట్‌బాల్‌ కెప్టెన్సీని విభజించాలనే ఆలోచనలో లేదు. దీంతో కోహ్లీ వన్డే నాయకత్వం కూడా ఊడుతుందనే ఊహాగానాలకు తగ్గట్టుగానే అతడిపై వేటుపడింది. 

టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్‌ శర్మకు అప్పగిస్తున్నట్టు బోర్డు ప్రకటించడం జరిగింది. అయితే అంత అవమానకరంగా నిర్ణయం ప్రకటించాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

 కొన్నేళ్ల క్రితం ఇంచుమించు ఇదే తరహా పరిస్థితులను ఎదుర్కొన్న సౌరవ్‌ గంగూలీ.. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండి కూడా కోహ్లీకి అండగా నిలవకపోవడాన్ని ఆక్షేపిస్తున్నారు! పదహారేళ్ల క్రితం కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌తో విభేదాలు, పేలవ ఫామ్‌ కారణంగా గంగూలీ కెప్టెన్సీతోపాటు ఏకంగా టీమ్‌లోనే చోటుకోల్పోవాల్సి వచ్చింది. 

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గంగూలీకి బోర్డు అండగా నిలవడంతో టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు కోహ్లీకి కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి.  బీసీసీఐలో సంకుచిత ప్రాధాన్యతలే అందుకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.

అయితే ఘన విజయాలు సాధించిన కెప్టెన్ లను అర్ధాంతరంగా తొలగించడం బీసీసీఐలో ఇదే మొదటిసారి కాదు. గతంలో 1983 ప్రపంచ కప్ గెలిచిన ఒక సంవత్సరంలోనే కపిల్ దేవ్ ను తొలగించారు.  జింబాబ్వే నుండి విజేతగా తిరిగి వచ్చిన తర్వాత సౌరవ్ కు కూడా  2005లో అటువంటి పరిస్థితే ఎదురయింది. 

దటి నుండి బీసీసీఐని ఒక క్రీడా సంస్థగా వృత్తిపరంగా కాకుండా, వాణిజ్య పర సంస్థగా నడుపుతున్నారని విమర్శలున్నాయి.  ఈ నిర్ణయం పట్ల `షేమ్ ఆన్ యూ’ అంటూ బీసీసీఐ, దాని అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై ట్విట్టర్‌లో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటి వరకు బీసీసీఐ అన్నా, గంగూలీ అన్నా ఎంతో గౌరవభావం ఉండేదని, ఇప్పుడది పోయిందని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, అసలు కోహ్లీని ఎందుకు తొలగించారో చెప్పాలని ప్రశ్నలు సంధిస్తున్నారు.

95 మ్యాచ్‌లలో 65 విజయాలు అందించాడని తొలగించారా? లేక, 19 ద్వైపాక్షిక సిరీస్‌లలో 15 గెలుచి చూపించినందుకా? అని నిలదీస్తున్నారు. కోహ్లీ విజయాల శాతం 70.43గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వారి దెబ్బకు ‘షేమ్ ఆన్ బీసీసీఐ’ అన్న హ్యాష్ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది.

చూస్తుంటే క్రికెట్‌లోకి కూడా రాజకీయాలు ప్రవేశించినట్టుగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్ ఒక్క దానినే ప్రాతిపదికగా తీసుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగని బోర్డుకు హితవు పలికారు. ఒకవేళ ప్రపంచకప్‌ను ప్రామాణికంగా తీసుకుంటే కనుక ధోనీ, గంగూలీ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచకప్‌లలో ఓటమి చవిచూడలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్ ను భారీ లాభదాయక వాణిజ్య ప్రక్రియగా ప్రారంభించినప్పటి నుండి క్రీడాకారులోనే వృత్తిపర ప్రాధాన్యతలు వెనకడుగు వేస్తున్నాయని పలువురు భావిస్తున్నారు. ఈ మధ్య ప్రపంచ కప్ లో భారత్ దారుణంగా ఓటమి చెండాడానికి సహితం ఐపీఎల్ కు ఇస్తున్న ప్రాధాన్యతే కారణమని పలువురు ప్రముఖ మాజీ క్రీడాకారులు వ్యాఖ్యానించడం గమనార్హం.