దక్షిణాసియాలోనే  అగ్రనటుడిగా  ప్రభాస్ 

టాలీవుడ్ నటుడు ప్రభాస్ ఇప్పుడుభారత దేశంలోనే కాకుండా, దక్షిణాసియాలోని అగ్రనటుడిగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్నారు. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు  సంపాదించిన ప్రభాస్ తాజాగా `నంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీ’గా నిలిచాడు.

యూకేకు చెందిన ఈస్టర్న్ ఐ వీక్లీ న్యూస్ పేపర్ పబ్లిష్ చేసిన టాప్ 50 ఏషియన్ సెలబ్రిటీల జాబితాలో రెబల్ స్టార్ అగ్రస్థానం  దక్కించుకున్నాడు. వరల్డ్ సినిమా, టెలివిజన్, లిటరేచర్, గ్లోబల్ మ్యూజిక్, సోషల్ మీడియా స్టార్లను తోసిరాజని ప్రభాస్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మూడు, ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ ఐదో స్థానాలను దక్కించుకోవడం విశేషం.

‘దేశ సినీ ప్రేక్షకుల కళ్లను ప్రాంతీయ భాషా చిత్రాల వైపు చూసేలా ప్రభాస్ చేశాడు. బాలీవుడ్ ఇక ఎంతమాత్రం బాస్ కాదని, ఎవ్వరైనా తమ సినిమాలను వేర్వేరు భాషల్లో విడుదల  చేసేలా ప్రభాస్ స్ఫూర్తిగా నిలిచాడు’ అని ఏషియన్ టాప్ సెలెబ్రిటీల జాబితాను రూపొందించిన ఈస్టర్న్ ఐ ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ అస్జాద్ నజీర్ పేర్కొన్నారు.

కాగా, బిగ్ బీ అమితాబ్ (నంబర్ 32), దిల్జీత్ దోస్సాంజ్ (11), లిల్లీ సింగ్ (12), తాప్సీ (14), విజయ్ (15), రుబీనా దిలైక్ (17), అక్షయ్ కుమార్ (18) కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఇప్పుడు భారత దేశంలో మరే నటుడికి ఇవ్వని  పారితోషికాన్ని, భారీస్థాయిలో ఇస్తుండటం గమనార్హం. 

ప్రభాస్ తన వంతుగా కూడా బాహుబలితో వచ్చిన మార్కెట్ గాలివాటం కాదని నిరూపించుకునేందుకు విశేషంగా కృషి చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా విశ్వజనీత ఆమోదం పొందగల కథల వైపు అడుగులు వేస్తున్నాడు. అందుకే ప్రభాస్ నటించిన సినిమాలు వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి.

బాహుబలి తర్వాత భారీ అంచనాలతో విడుదలైన సాహో కూడా హిందీలో అద్భుతమైన విజయం సాధించింది. సుజిత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో రూ 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అక్కడ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. 

ఇప్పుడు  ఆయనతో సినిమాల కోసం కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్, ఓం రౌత్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా లాంటి పాన్ ఇండియన్ డైరెక్టర్లు  పోటీ పడుతున్నారు. ప్రభాస్ హీరోగా నటించే సినిమాల కోసం వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. 

ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ తీరికలేకుండా ఉన్నాడు.  ఈయన ఒక్కో సినిమాకు రూ 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. భారత దేశం నటులలో ఎందరో సూపర్ స్టార్ లు ఉన్నప్పటికీ వారెవ్వరూ ఇప్పటి వరకు   సినిమాకు రూ.150 కోట్ల పారితోషికం ఎవరూ అందుకోలేదు. ఆ రికార్డు చేరుకున్న తొలి హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు.

ప్రస్తుతం ప్ర‌భాస్‌ రాధే శ్యామ్, సలార్, నాగ్ అశ్విన్ సినిమా, ఆదిపురుష్, స్పిరిట్ సినిమాలు చేస్తున్నారు.  వీటిలో రాధే శ్యామ్ జనవరి 14, 2022న విడుదల కానుంది. ఆ తర్వాత సలార్, ఆదిపురుష్ కూడా 2022 లోనే విడుదల కానున్నాయి. కేవలం హీరోగానే కాకుండా సామాజిక బాధ్యత విషయంలో కూడా ప్రభాస్ అందరికంటే ముందున్నాడు. 

మొన్న ఏపీలో వరదల కారణంగా నష్టపోయిన బాధితుల కోసం  విరాళంగా కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చారు. చేసే ప్రతి సినిమా కోసం ప్రాణం పెడుతూ బాలీవుడ్ హీరోలు కూడా షాక్ అయ్యేలా మేకోవర్ అవుతున్నారు ప్రభాస్.