రైతుల నిరసనలు విరమణ పట్ల బిజెపి హర్షం 

తమ నిరసనను నిలిపివేసి, ఇంటిదారి పట్టాలని రైతు సంఘాలు తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి నాయకుడు,  కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ స్వాగతించారు. అయితే వచ్చే ఏడాది మొదట్లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో  కేంద్రంలో,  రాష్ట్రంలోని తమ  పార్టీ ప్రభుత్వాలు చేసిన పనుల  ఆధారంగానే బిజెపి ప్రచారం ఉంటుందని స్పష్టం చేశారు.

నరేంద్ర మోదీ  ప్రభుత్వ చర్యలతో సంతృప్తి చెంది రైతులు ఇంటికి తిరిగి వస్తున్నందున ఎన్నికలలో పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడుతుందని పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుండి బిజెపికి చెందిన ప్రముఖ జాట్ నేత అయిన  బల్యాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

“ఇది నాకే కాకుండా మా అందరికీ సంతోషకరమైన విషయం.  వారు (రైతులు) ప్రభుత్వ చర్యలతో సంతృప్తి చెంది ఇంటికి వెళ్తున్నారు” అని బల్యాన్ పార్లమెంటు వెలుపల విలేకరులతో తెలిపారు.

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే కేంద్రం నిర్ణయం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే చేసినదా  అని అడిగిన ప్రశ్నకు, రాజకీయ పార్టీలు ఎల్లప్పుడూ ఎన్నికల గురించి ఆందోళన చెందుతూ ఉంటాయని,  అయితే అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే “మన రైతు సోదరులు సంతృప్తిగా ఇంటికి తిరిగి వస్తున్నారు” అని బల్యాన్ పేర్కొన్నారు.

“బీజేపీ మంచి స్థితిలో ఉంది, ఇప్పుడు అది మరింతగా మెరుగుపడుతుంది. గ్రామాలలో ప్రజలు రైతుల ఆందోళన గురించి మమ్మల్ని అడిగేవారు. ఇప్పుడు మేము కేంద్రంలో, ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం చేసిన పని గురించి మాట్లాడవచ్చు. ,”  అని కేంద్ర మంత్రి చెప్పారు.

పంజాబ్,  హర్యానాతో పాటు, జాట్-ఆధిపత్యం ఉన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రైతుల ఆందోళన ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఆయా ప్రాంతాలలోని రైతులు నిరసనలకు మద్దతు పలకడమే అందుకు కారణం.