కావాలనే రాజకీయం చేస్తున్నటీఆర్ఎస్

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రచారం కోసమే టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. హుజురాబాద్ లో ఓటమి తర్వాతే ఓ పధకం ప్రకారం టీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుందని ఆయన విమర్శించారు. 
 
ఈ సందర్భంగా  బీజేపీపై టీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన  నిప్పులు చెరిగారు. అయితే తాము టీఆర్ఎస్ కో ,కేసీఆర్ కో భయపడబోమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బాయిల్డ్ రైస్  ఒప్పందంపై సంతకం చేసింది కేసీఆరేనని ఆయన స్పష్టం చేశారు.  మెడ మీద కత్తిపెట్టారనేది దురదృష్టకరమన్నారు. 
 
‘‘‘హుజూరాబాద్ ఓటమి నుంచి బయట పడేందుకు లేని సమస్యను సృష్టించారు. ముందే ఒప్పందాలు చేసుకొని మళ్లీ సమస్య సృష్టిస్తున్నారు. రైతులకు మేము ఎప్పుడు నష్టం చేయం. ఈ సీజన్‌లో వచ్చే ప్రతి గింజ కొంటాం. కొనడానికి సిద్ధంగా ఉన్నాం” అంటూ స్పష్టం చేశారు.
 
మెడమీద కత్తిపెట్టి బెదిరిస్తే.. సంతకం చేయడానికి.. టీఆర్ఎస్ అంత మెతక ప్రభుత్వామా? అని ఆయన ఎద్దేవా చేశారు.  బాయిల్డ్ రైస్  ఒప్పందంపై సంతకం చేసి ఇపుడు సమస్య అంటున్నారని దయ్యబట్టారు. గతేడాది ధాన్యం కొనుగోళ్లకు రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టారని, ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి  పీయూష్ గోయల్ క్లారిటీ ఇచ్చారని ఆయన తెలిపారు. 
 
కిసాన్ బచావో కాదు అది కేసీఆర్ బచావో నినాదాలని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు చేయమని  రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం బాధ్యత రహితం అని విమర్శించారు. ధాన్యం సేకరించకుంటే ఒక రూపాయికి కిలో బియ్యం పథకాన్ని మీరు రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. రబీలో ముడిబియ్యం తీసుకుంటాం అని పేర్కొంటూ బియ్యం ఎంత తీసుకుంటామనేది ఫిబ్రవరిలో  నిర్ణయిస్తామని తెలిపారు.
 
వానాకాలంలో ప్రతి ధాన్యం గింజ కొంటామని  స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు ధర్నాలు చేయడం ఆపి రైతుల నుండి ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించాలని కిషన్ రెడ్డి హితవు చెప్పారు.