ప్రతిపక్షాల కుమ్ములాటలన్నీ రెండో స్థానం కోసమే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న మాస్ బేస్ కారణంగా ఎటువంటి తీవ్రమైన సవాలు ఎదురుకాదని, ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న కుమ్ములాటలన్నీ రెండో స్థానం కోసమే అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.

19వ హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ చివరి రోజున మాట్లాడుతూ,  2024లో ప్రతిపక్షానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందా లేదా ఇటీవలి నెలల్లో తన జాతీయ పాదముద్రను దూకుడుగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)  నాయకత్వం వహిస్తుందా అనే దానిపై అర్ధంలేని ఊహాగానాలు అని ఆయన కొట్టిపారేశారు.

“ప్రధాని మోదీకి ఉన్న మాస్ బేస్,  ప్రజాదరణ చాలా పెద్దది, బిజెపికి ఎటువంటి సవాలు లేదు. ఏదైనా గొడవ జరిగితే, అది రెండవ స్థానం కోసం. కాంగ్రెస్, మమతా బెనర్జీ లేదా మరొకరు దాని కోసం పోరాడుతూనే ఉంటారు. మాకు దానితో సంబంధం లేదు” అని ఆయన తేల్చి చెప్పారు.

కాంగ్రెస్, దాని మాజీ మిత్రపక్షం తృణమూల్ కాంగ్రెస్ మధ్య ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే విషయమై తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సమయంలో బిజెపి సీనియర్ నాయకుడు,  భారతదేశంలో సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రులలో ఒకరైన చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత వహిస్తున్నాయి.

మేఘాలయలోని 12 మంది శాసనసభ్యులతో సహా గత మూడు నెలల్లో తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి చాలా మంది ఉన్నత స్థాయి నాయకులను వేటాడింది.  రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు. చౌహాన్ కాంగ్రెస్‌పై దాడి చేసే సమయంలో ప్రతిపక్ష శిబిరంలో నెలకొన్న ఉద్రిక్తలను గొడవను ప్రస్తావించారు.

“కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ప్రతిపక్షానికి నాయకత్వం వహించే సామర్థ్యాన్ని ఇతర పార్టీలు కూడా అనుమానిస్తున్నాయి. అలాగే, మమతా బెనర్జీ కాంగ్రెస్‌ను అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు. ఆమె ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తానని చెబుతున్నారు” అని హెచ్‌టి జాతీయ రాజకీయ ఎడిటర్ సునేత్ర చౌదరితో సంభాషణలో ఆయన పేర్కొన్నారు.

గత ఏడాది మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోసి,  నాల్గవసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చౌహాన్, రాహుల్ గాంధీని విమర్శించారు. వారు క్షేత్రస్థాయిలో పోరాడలేకపోతున్నారని, రాజకీయాల గురించి తీవ్రంగా ఆలోచించలేక పోతున్నారని  తెలిపారు.

“బాగా నడుస్తున్న ప్రభుత్వాన్ని ఎలా నాశనం చేయాలి అనేది రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలి. మధ్యప్రదేశ్‌లో అతను ఏమి చేసాడో చూడండి.  మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సింధియా జీ పట్ల అతని ప్రవర్తన ఏమిటి? అతని సహచరులను కలవడానికి ప్రభుత్వం ఎప్పుడూ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు” అంటూ చౌహాన్ రాహుల్ రాజకీయాలను ఎద్దేవా చేశారు.

2020 మార్చిలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా,  ఆయనకు సన్నిహితంగా ఉన్న 22 మంది శాసనసభ్యులు కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బిజెపిలో చేరిన తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.

కాంగ్రెస్ కుమ్ములాటలు విమర్శిస్తూ  గత ఏడాది ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభాన్ని ఉదహరించారు. అట్లాగే, పంజాబ్ లో మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూల మధ్య సుదీర్ఘ ఆధిపత్య పోరాటం తర్వాత చరణ్‌జిత్ చన్నీని పార్టీ ముఖ్యమంత్రిగా నియమించింది.

“నాయకులు ఇలాగే ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు శత్రువులు అవసరం లేదు. ఇది నెమ్మదిగా తన సొంత నాయకులను కోల్పోతోంది. పంజాబ్ సరిహద్దు రాష్ట్రం. అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలని, భారతదేశాన్ని అస్థిరపరచాలని కోరుకుంటోంది. ఇంత సున్నితమైన రాష్ట్రంలో రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని కలవరపరిచారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ఉనికిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

“రాహుల్‌జీ ప్రకటనలను నేను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోను.  ఎందుకంటే అతను ఎప్పుడూ పొలాలు, గ్రామాలు, పల్లెలను చూడలేదు. ఆయన వ్యాఖ్యలను రైతులు కూడా నమ్మడం లేదు. అతను ట్వీట్ చేసి సెలవు తీసుకుంటాడు. అలాంటి వ్యక్తులు ఏ సమస్య  లోతును ఎప్పటికీ అర్థం చేసుకోలేరు” అంటూ చౌహన్ రాహుల్ నాయకత్వాన్ని కొట్టిపారవేసారు. 

కాగా,  కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను విషయాలను సీరియస్ గా తీసుకొనే నాయకుడిగా ప్రశంసించారు. మోదీ నాయకత్వాన్ని కొనియాడిన ఆయన, ప్రధాని అభివృద్ధి ఎజెండా సామాన్య భారతీయుల జీవితాలను మార్చేందుకు, ప్రపంచం దృష్టిలో దేశ ప్రతిష్టను పెంచేందుకు ఉద్దేశించినదని తెలిపారు. ‘‘మోదీజీ తీసుకునే ప్రతి నిర్ణయమూ దేశ ప్రయోజనాల కోసమే. ఆయన నిజమైన ప్రపంచ నాయకుడు” అని ప్రశంసించారు.