పరిపాలనలో సంపూర్ణ పారదర్శకత, జవాబుదారీతనం

అవినీతిని ఎంతమాత్రమూ సహించరాదని, పరిపాలనలో అన్ని స్థాయిల్లో సంపూర్ణమైన పారదర్శకత, జవాబుదారీతనం అవలంబించాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి అవినీతి చెద పడితే సామాన్య మానవుడికి తీవ్ర నష్టంగా పరిణమిస్తుందని ఆయన హెచ్చరించారు. 

 సమాజంలో నైతిక విలువలు సార్వత్రికంగా పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పరిణామాన్ని అరికట్టేందుకు విశాల ప్రాతిపదికగా సామాజిక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. జార్ఖండ్ రాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ మాజీ క్యాబినెట్ కార్యదర్శి ప్రభాత్ కుమార్ రచించిన ‘పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ : ఎ క్వెస్ట్ ఫర్ నైతిక్ భారత్’ పుస్తకాన్ని ఆదివారం ఉపరాష్ట్రపతి తన నివాసంలో ఆవిష్కరించారు.

అవినీతికి పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులపై అవినీతి నిరోధక చట్టం కింద సకాలంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ కేసుల విషయంలో సత్వర పరిష్కారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో సదుద్దేశంతో క్రియాశీలక చర్యలను చేపడుతున్న అధికారులను నిరుత్సాహ పరచడం గానీ, వేధించడం గానీ చేయకూడదని హితవు పలికారు. 

అవినీతికి పాల్పడిన అధికారులపై కఠినంగా వ్యవహరించాలి కానీ, విస్తృత ప్రజా ప్రయోజనాలరీత్యా ధైర్యంగా నిర్ణయాలను తీసుకునే అధికారులను నిరుత్సాహ పరచకూడదు ఆయన సూచించారు. రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్ (ఏఐర్సీ) సిఫారసుల ఆధారంగా సివిల్ సర్వెంట్లకు సమగ్రమైన నైతిక స్మృతిని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. 

పుస్తక రచయిత ప్రభాత్ కుమార్, ప్రచురణకర్తలు ఐసీ సెంటర్ ఫర్ గవర్నెన్స్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ప్రభాత్ కుమార్, ఐసీ సెంటర్ ఫర్ గవర్నెన్స్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ కపూర్, సెక్రటరీ జనరల్ శాంతి నారాయణ్ సహా పలువురు సివిల్ సర్వీస్‌ రిటైర్డ్‌ అధికారులు హాజరయ్యారు.