1971 యుద్ధ వీరుడిని కలిసిన అమిత్ షా

రాజస్థాన్‌లో పర్యటిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఓ యుద్ధ వీరుడిని కలిశారు. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భైరోన్ సింగ్ రాఠోడ్‌తో ముచ్చటించారు. భైరోన్ 1963లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో చేరారు. యుద్ధంలో లోంగెవాలా పోస్ట్ వద్ద వీరోచితంగా పోరాడినందుకు ఆయనను రాజస్థాన్ ప్రభుత్వం సేనా పతకంతో సత్కరించింది.

భారత్-పాక్ యుద్ధంలో 14వ బెటాలియన్ డీ-కంపెనీ 3వ ప్లాటూన్‌లో లాన్స్ నాయక్ భైరోన్ సింగ్ రాథోడ్ నియమితులయ్యారు. 23 పంజాబ్‌ను భారత సైన్యం లోంగెవాలా పోస్ట్ వద్ద మోహరించింది. దీనికి మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్‌పురి నేతృత్వం వహించారు. భైరోన్‌ను పంజాబ్ బెటాలియన్‌కు గైడ్‌గా నియమించారు. 

రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత భారత సైనికులకు ఓ సమాచారం అందింది. పాకిస్థానీ దళాలు భారీ ట్యాంకులు, అతి పెద్ద సైన్యంతో వస్తున్నట్లు తెలిసింది. ఆ రాత్రి సమయంలో పాకిస్థాన్ దళాలను నిలువరించడానికి భారత వైమానిక దళం అందుబాటులో లేదు. దీంతో 120 మంది సైనికులు, భైరోన్ సింగ్ వెంటనే లోంగెవాలా పోస్ట్‌ నుంచి పోరాడే బాధ్యతలను స్వీకరించారు.

పాకిస్థాన్ సైన్యం విపరీతంగా కాల్పులు జరుపుతుండగా, ఎంతో ధైర్యసాహసాలతో ఎదుర్కొన్నారు. భైరోన్ వీరోచితంగా ఎల్ఎంజీతో 7 గంటలపాటు కాల్పులు జరిపారు. దాదాపు 25 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టారు. ఆయన సేవలకు గుర్తింపుగా రాజస్థాన్ ప్రభుత్వం 1972లో ఆయనను సేనా పతకంతో సత్కరించింది. 

సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) 57వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ ఉత్సవాలు జైసల్మేర్‌లో జరగడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ సిబ్బందికి అమిత్ షా పతకాలను అందజేశారు. 

భారత దేశ సరిహద్దుల్లో జరిగే దాడులకు భారత దేశం దీటుగా బదులిచ్చిందని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటువంటి దాడులపై సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా దీటుగా స్పందించిందని గుర్తు చేశారు.  భారతదేశం యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోందని ఆయన చెప్పారు. దీనిని త్వరలోనే భద్రతా దళాలకు అందజేస్తామని తెలిపారు.

2019లో జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం, అధికరణ 370ని రద్దు చేయడం జరిగిన తర్వాత పాకిస్థాన్‌తోగల భారత దేశ సరిహద్దుల వెంబడి డ్రోన్లు, గుర్తు తెలియని ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ వస్తున్నాయని పేర్కొన్నారు.