హద్దు మీరి, దిగజారి మాట్లాడాతున్న కేసీఆర్ 

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  పిచ్చి ముదిరి, హద్దు మీరి, దిగజారి మాట్లాడాతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డాయిరు. కేసీఆర్ భాషను సెన్సార్ చేయాలని, టీవీలలో ఆయన లైవ్ కూడా బంద్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ మాట్లాడేటప్పుడు  బీప్ సౌండ్ వేసి బూతులు కట్ చేయాలని.. లేదంటే చానళ్లపై కేసులు పెడతారని సంజయ్ హెచ్చరించారు. 

కేసీఆర్ సోమవారం ఓ ప్రెస్ మీట్ లో కిషన్ రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కిషన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో హుందాగా, మంచి భాషను ఉపయోగిస్తూ మాట్లాడారని చెబుతూ కేంద్ర మంత్రిని పట్టుకుని, ఏదిపడితే అది మాట్లాడితే సహించేది లేదని సంజయ్ హెచ్చరించారు. 

“కేసీఆర్ నీ మాటలు, తిట్లను నీ పక్కనున్న వాళ్లే అసహ్యించుకుంటున్నారు. నీ నోటిని ఫినాయిల్ తో కడిగినా, ఇనుప బ్రష్ తో రుద్దినా ఉపయోగం లేదు. వడ్లు కొంటాం అని మేం చెబుతున్నాం. కొనేది లేదని నువ్వు చెబుతున్నావ్. కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తామని అంటున్నది నువ్వు” అంటూ దుయ్యబట్టారు. 

అయినా అన్నీ కేంద్రం కొన్నాక.. నువ్వు ఉన్నది ఎందుకు? అని ప్రశ్నించారు.  మొన్నటి వరకు మొత్తం నువ్వే కొంటా అన్నావని గుర్తు చేస్తూ యాసంగి పంట కూడా కొనాల్సిందే అని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలో మాత్రమే ఎందుకొస్తుంది? అని సంజయ్ నిలదీశారు. 

వరి దిగుబడిలో తెలంగాణ 7వ స్థానంలో, సేకరణలో మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. మెడ మీద కత్తి పెడితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కి కూడా తెలంగాణ రాసి ఇస్తావా? మెడ మీద కత్తి పెట్టినందుకే కృష్ణా వాటాకు ఒప్పుకున్నవా? అంటూ ఎద్దేవా చేశారు. 

మెడ మీద కట్టి పెడితే ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదు? మరి నేను మెడ మీద కత్తి పెడతా, ఫామ్ హౌస్ రాసిస్తావా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.  ఫిజికల్ వెరిఫికేషన్ రిపోర్టులో ఒక్క వరంగల్ జిల్లాలోనే చాలా తేడా ఉన్నట్టు తేలిందని చెబుతూ సాగు విస్తీర్ణం, దిగుబడి గణాంకల్లో తేడా ఉందని పేర్కొన్నారు. 

పాత బియ్యం రీసైక్లింగ్ జరుగుతుందని సంజయ్ ఆరోపించారు. ఈసారి కొత్తగా కేంద్రం యాసిడ్ టెస్ట్ చేస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ బండారం, మిల్లర్ల బండారం బయటపడుతుందని హెచ్చరించారు. అందుకే మిల్లర్ల కోసం టీఆర్ఎస్ గొడవ చేస్తోందని ధ్వజమెత్తారు. బాయిల్డ్ రైస్ సమస్య అధిగమించడానికి 5 రకాల విత్తనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటిని రైతులకు ఇవ్వొచ్చు గదా అని చెప్పారు. ఆ బియ్యం కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉందని, కానీ కేసీఆర్ రైతులకు ఆ విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 

పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీద కేసీఆర్ కి ప్రేమ కలుగుతోంది. బహుశా ఆ దేశాలతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడేమో? అక్కడ జరిగే ఉగ్రవాద శిక్షణా శిబిరాలకు నిధులిస్తున్నారా? అంటూ నిఘా సంస్థలు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. రైతులు, ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారని చెబుతూ  నీ కంటే పెద్ద హంతకుడు ఎవరున్నారు?’ అని  బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.