`ముందస్తు’ కోసమే కిషన్ రెడ్డిపై కేసీఆర్ దూషణలు!

గడువు ముగిసిన తర్వాత తిరిగి ఎన్నిక కావడం అసంభవం అని గ్రహించే, ప్రాంతీయవాద సెంటిమెంట్ ను రెచ్చగొట్టి, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిపై దూషణలకు దిగుతున్నారని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగరరావు ఆరోపించారు. 

వరి సేకరణ సమస్యను ప్రాంతీయ రాజకీయ సెంటిమెంట్‌గా మార్చుకోవాలనే తహతహతోనే కిషన్‌ రెడ్డికి వ్యతిరేకంగా పరుష పదజాలం ఉపయోగించినట్టు తేటతెల్లమవుతోందని ఆయన తెలిపారు. దీన్ని వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశాలు ఆయనలో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. 

ఏదేమైనా కిషన్‌రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్‌ ఉపయోగించిన దూషణపూరితమైన, అన్‌పార్లమెంటరీ భాషను ఆయన  తీవ్రంగా ఖండించారు.  ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి భాషను ఉపయోగించడం ఆయనకు తగదని స్పష్టం చేశారు. ఆయన ఉపయోగిస్తున్న భాష చూస్తుంటే సీఎం కేసీఆర్‌కు వచ్చే మూడు నెలల్లో హడావుడిగా ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడం మినహా మరో గత్యంతరం కనిపించడం లేదని పేర్కొన్నారు. 

పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలను ఎదుర్కొంటే తీవ్రమైన పరాజయం తప్పదని గుర్తించే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.  సీఎం కేసీఆర్‌ తీరు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను దిగజార్చేందుకు ఆయన  కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. 

ముందు ముందు ఏం జరగబోతుందో సీఎం కేసీఆర్‌ వరుస మీడియా  సమావేశాలు తెలియజేస్తున్నాయని తాను బలంగా నమ్ముతున్నట్లు కృష్ణసాగరరావు తెలిపారు. ఇప్పుడు, అప్పుడో కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేయడం తథ్యం. హడావుడిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఆయన రాజకీయ వేదికను, ప్రాంతీయ అజెండాను సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోందని స్పష్టం చేశారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టుగా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ విసురుతున్న ఈ రాజకీయ ఉచ్చులో చిక్కుకోరని తాను బలంగా నమ్ముతున్నట్లు బీజేపీ నేత చెప్పారు. అసెంబ్లీని రద్దు చేయాలనే స్పష్టమైన ఆలోచనతో సీఎం కేసీఆర్‌ ఉన్నారు కాబట్టి శాసనసభ మరో దఫా సమావేశం నిర్వహించడం అనుమానమే అని కూడా చెప్పారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి, ఇతర కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ ఉపయోగించిన పరుష పదజాలాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. హడావుడిగా ఎన్నికలకు వెళ్లాలనే ఏకైక లక్ష్యంతోనే ఆయన తెలంగాణ రైతుల పాలిట ఆత్మబంధువునని చాటి చెప్పుకునేందుకు తన హోదాను ఉపయోగించుకుంటున్న తీరు స్పష్టంగా కనిపిస్తోందని కృష్ణసాగరరావు తెలిపారు. 

పరిపాలనా ఫలితాలను బేరీజు వేస్తే సీఎం కేసీఆర్‌, ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి ఎన్నికవడం అసాధ్యం అని స్పష్టం చేశారు. మళ్లీ ఎన్నిక అవ్వాలనే తీవ్రమైన తపనతోనే ఆయన తన పాత పాట ప్రాంతీయ వాదాన్ని తిరిగి తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు.