`ఆర్టికల్ 370′ పేరుతో గాంధీ నగర్ లో క్రికెట్, కబాడీ పోటీలు 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో బీజేపీ, “గరిష్ట సంఖ్యలో యువతను పార్టీలోకి ఆకర్షించేందుకు గాంధీనగర్ లోక్‌సభ ప్రీమియర్ లీగ్ 370  (జి ఎల్ పి  ఎల్ 370) పేరుతో క్రికెట్, కబడ్డీలో టోర్నమెంట్‌లను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు స్థానిక నాయకులు వెల్లడించారు. 

అహ్మదాబాద్ నగర బిజెపి యూనిట్ ప్రధాన కార్యదర్శి జితూభాయ్ పటేల్ ప్రకారం, అమిత్ షా నేతృత్వంలో 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 పేరును  లీగ్‌కు పెట్టారు. డిసెంబర్ మధ్యలో టోర్నమెంట్‌లను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు.

గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం బిజెపి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న హర్షద్ పటేల్ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న (యువ) ఓటర్లను బిజెపికి అనుకూలంగా మార్చడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వార్డులో కనీసం రెండు జట్లు (క్రికెట్, కబడ్డీకి ఒక్కొక్కటి) ఉండాలనేది లక్ష్యంగా చెప్పారు. .

 “హోం మంత్రి అమిత్ షా మొదట ఈ (ఆలోచన) గురించి పార్టీలో ఉన్న మాలో 8-10 మందితో చర్చించారు. అనంతరం 200-250 మంది పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు బాధ్యతలు అప్పగించారు” ఆయన వివరించారు. 

ఉదాహరణకు, ఐదేళ్ల క్రితం అహ్మదాబాద్‌లో క్రికెట్ కోసం కర్ణావతి ప్రీమియర్ లీగ్ (కెపిఎల్)ను నిర్వహించిన గుజరాత్ ఎంఓఎస్ జగదీష్ విశ్వకర్మను టోర్నమెంట్‌లను సన్నాహాలు చేయమని అడిగారు. యాదృచ్ఛికంగా, అమిత్ షా 2016 లో కెపిఎల్  ను ప్రారంభించారు.

బీజేపీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్ వాఘేలా మాట్లాడుతూ లోక్‌సభ నియోజకవర్గం మొత్తం బృందం పాల్గొంటోంది. మొత్తం నియోజకవర్గానికి ఒక కబడ్డీ టోర్నమెంట్,  అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఒకటి చొప్పున ఏడు క్రికెట్ టోర్నమెంట్‌లను నిర్వహించాలనేది ప్రణాళిక అని తెలిపారు. 

ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వేజల్‌పూర్, ఘట్లోడియా, నారన్‌పురా, సబర్మతి, కలోల్, గాంధీనగర్ (ఉత్తరం), సనంద్. లోక్‌సభ నియోజకవర్గం అహ్మదాబాద్, గాంధీనగర్‌లో దాదాపు 1,800 బూత్‌లను ఉన్నాయి. స్థానిక బిజెపి ఆఫీస్ బేరర్‌లకు టీమ్‌లు, వేదికలు, వ్యాఖ్యాతలను గుర్తించడం నుండి నియమాలను రూపొందించే వరకు బాధ్యతలు అప్పగించారు. 

లీగ్ ప్రస్తుతం పురుషులకు మాత్రమే నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రైవేట్ యజమానుల నుండి అద్దెకు తీసుకున్న మైదానంలో టెన్నిస్ బంతులను ఉపయోగించి క్రికెట్ మ్యాచ్‌లు జరుపుతామని బిజెపి నాయకులు తెలిపారు. ప్రధానంగా వార్డు స్థాయిలో వాట్సాప్ గ్రూపుల ద్వారా టోర్నీకి ప్రచారం నిర్వహిస్తున్నారు. 

అమిత్  షాకు  2007 నుండి గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జిసిఎ)తో అనుబంధం ఉంది. రాష్ట్రంలో 16 సంవత్సరాల కాంగ్రెస్ నాయకుల పాలనను ముగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ  ఛైర్మన్‌గా ఉన్నప్పుడు అమిత్  షా జిసిఎ వైస్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. షా కుమారుడు జయ్ షా ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి.

“ఖేల్ మహాకుంభ్ ద్వారా ఆటగాళ్లను ప్రేరేపించాలనే నరేంద్రభాయ్ భావన ప్రకారం, అమిత్‌భాయ్ దీన్ని (క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్) నిర్వహిస్తున్నారు. ఇది ఆయన మార్గదర్శకత్వం,  ప్రేరణ ద్వారా జరుగుతోంది” . అని అహ్మదాబాద్ నగర బిజెపి యూనిట్ ప్రధాన కార్యదర్శి జితుభాయ్ పటేల్ తెలిపారు.