రూ 400 కోట్ల హెల్త్‌ వర్సిటీ నిధుల `ప్రభుత్వం’కు మళ్లింపు

తన పరిమితులను మించి ఎక్కడపడితే అక్కడ అప్పులు చేస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు ఇప్పుడు ఆర్ధిక సంస్థలు ఏవీ కొత్తగా రుణాలు ఇవ్వడానికి సుముఖంగా లేకపోతూ ఉండడంతో నిబంధనలను తుంగలో తొక్కి, అధికార బలంతో స్వతంత్ర సంస్థల నిధులను ప్రభుత్వంకు బలవంతంగా బదలాయించడం చేస్తున్నారు. 

తాజాగా, అభ్యంతరాలను పట్టించుకోకుండా, నిబంధనలను పాటించకుండా అర్ధాంతరంగా ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీకి చెందిన రూ 400 కోట్ల నిధులను ప్రభుత్వ కార్పొరేషన్ కు బదిలీ చేశారు. దానితో ఈ యూనివర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, ఇతర ఉద్యోగులు తమ భవిష్యత్ ఏమిటని ఆందోళన చెందుతున్నారు. 

విశ్వవిద్యాలయంలోని ఉన్నతాధికారులు తెలుసుకొనే లోపుగానే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు వచ్చాయని అంటూ మొత్తం రూ.400 కోట్లను స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ (ఎస్ఎఫ్ఎస్ సి)కు మళ్లించారు.  నిధులు మళ్లింపు, అధికారుల నిర్లక్ష్య ధోరణి పట్ల భగ్గుమన్న ఉద్యోగులు మంగళవారం నుంచి విధులకు హాజరు కాబోమని ప్రకటించారు. 

ఈ నెల 9వ తేదీన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సిఫార్సులతో ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ నుంచి ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీకి నిధులు బదలాయించాలని అంటూ ఒక లేఖ వచ్చింది. ఇందుకు వర్సిటీ తిరస్కరించింది. వర్సిటీ నిధులు జాతీయ బ్యాంక్‌లు మినహా ఇతరత్రా వాటికి బదలాయించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 

కానీ అప్పటి నుంచి వర్సిటీ ఉన్నతాధికారులపై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయి. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, సీఎంవో అధికారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ కలసి నిధుల మల్లింపుకు సిద్ధమయ్యారు. ఈ విషయమై మీడియాలో విమర్శలు చెలరేగడంతో నాలుగు రోజులు ఆగిన్నట్లు ఆగి, అర్ధాంతరంగా సోమవారం ఈ తతంగం అంతా పూర్తి చేశారు. 

ఈ నెల 13న జరిగిన ఈసీ సమావేశంలో మిగిలిన జాతీయ బ్యాంక్‌ల మాదిరిగానే  ఎస్ఎఫ్ఎస్ సి   కూడా టెండర్లలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కోసం టెండర్లు ఆహ్వానించినప్పుడు ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వాటిలో డిపాజిట్‌ చేస్తామని, తమపై ఎవరి ఒత్తిడి లేదని వీసీ డా.పి.శ్యామ్‌ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ డా.శంకర్‌ ప్రకటనలు చేశారు. 

అయితే రెండు వారాల వ్యవధిలోనే టెండర్ల ప్రసక్తి లేకుండా ఏకపక్షంగా ఈ నిధులను మళ్లించారు. గత 36 ఏళ్ల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయంలో వర్సిటీ పాటిస్తున్న నిబంధనల్ని మొత్తం తుంగలో తొక్కేశారు. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ను పక్కకు పెట్టేశారు. వర్సిటీ నిబంధనల ప్రకారం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయంలో ముందుగా ఈసీ సమావేశం నిర్వహిస్తారు. 

టెండర్లు ఆహ్వానించేందుకు ఆమోదిస్తారు. నిబంధనల ప్రకారం టెండర్లు పిలుస్తారు. ఏ బ్యాంక్‌ ఎక్కువ వడ్డీ ఇస్తుందో అందులో నిధులు డిపాజిట్‌ చేస్తారు. ఇప్పుడు ఈ నిబంధనలు ఏమీ లేవు. ప్రస్తుతంవర్సిటీ నిధులు కెనరా బ్యాంక్‌లో రూ.400 కోట్లు ఎఫ్‌డీ రూపంలో ఉన్నాయి. 

ఎఫ్‌డీలు మెచ్యూరిటీ కావడానికి మరో ఏడాది గడువు ఉండడంతో, ఇప్పుడే తీసుకొంటే రూ 43 కోట్లు నష్టం వస్తుందని బ్యాంకు అధికారులు వారించినా పట్టించుకోలేదు.  ప్రస్తుతం ఎఫ్‌డీలు ఉన్న బ్యాంక్‌ నుంచి ప్రతి మూడు నెలలకు వర్సిటీకి వడ్డీ వస్తుంది. అయితే   ఎస్ఎఫ్ఎస్ సి  వడ్డీ ఇస్తుందా..? అన్నదానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మొత్తానికే మోసం రావచ్చని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.