ఏపీ బిజెపికి 13 మందితో కోర్ కమిటీ 

 ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త కోర్ కమిటీని పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. కొత్త కోర్ కమిటీలో 13 మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. 

ప్రకటించిన ఈ కోర్ కమిటీ సమావేశాన్ని నెలకి ఒకసారైనా తప్పనిసరిగా జరపాలని నిర్ణయించారు. ఈ కమిటీలో పార్టీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి డి  పురందరేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీలు సుజనా చౌదరి,  జీవీఎల్ నరసింహరావు, సిఎం రమేష్, టీజీ వెంకటేష్ ఉన్నారు. 

వీరు కాకుండా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవి, చంద్రమౌళి, మాజీ ఎమ్యెల్యే నిమ్మక్క జయరాజు ఉన్నారు. 

అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా నేషనల్ జాయింట్ సెక్రటరీ శివ ప్రకాష్ జి, ఏపీ ఇంచార్జ్, కేంద్ర మంత్రి  మురళీధరన్, సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఉన్నారు. ఈ మధ్య కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తిరుపతి వచ్చిన సందర్భంగా తమను కోర్ కమిటీ సమావేశాలకు పిలవడం లేదని కొద్దిమంది ఎంపీలు ఫిర్యాదు చేశారు. 

పైగా, కీలకమైన రాజకీయ నిర్ణయాలు తీసుకొనే సమయంలో అందరిని సంప్రదించడం లేదని కూడా తెలిపారని వార్తలు వచ్చాయి. దానితో ఇక నుండి కీలక మైన రాజకీయ నిర్ణయాలు అన్ని కోర్ కమిటీలో ముందుగా తీసుకోవాలని పార్టీ కేంద్ర నాయకత్వం స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది.