ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు  లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందని ఆయన తెలిపారు. అందువల్ల 2015-16 నుంచి 2019-20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తి కింద వచ్చే మొత్తాన్ని ప్రత్యేక సాయంగా ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించామని గుర్తు చేశారు. పైగా,  2015-16 నుంచి 2019-20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని కూడా కేంద్రమే చెల్లిస్తుందని నిత్యానందరాయ్‌ తెలిపారు. 

విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతోపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయని కేంద్ర మంత్రి చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.  విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని, మిగిలిన వాటికి కొంత సమయం ఉందని ఆయన వివరించారు.