మహిళా ఎంపీలతో శ‌శిథ‌రూర్ సెల్ఫీపై దుమారం

పార్లమెంట్ సమావేశాలలో చట్ట సంబంధ అంశాలపై, ప్రజా సమస్యలపై సమాలోచనలు పట్ల దృష్టి సారింపకుండా సహచర మహిళా ఎంపీలతో సెల్ఫీ దిగి, అభ్యంతరకరమైన వాఖ్య వ్రాసిన కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. 

సెల్ఫీ దిగ‌డం వ‌ర‌కు ఓకే కానీ ఆ ఫొటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో పెద్ద దుమార‌మే రేగుతుంది. పైగా, “లోక్ స‌భ అంద‌మైన ప్ర‌దేశం కాదా” అనే క్యాప్ష‌న్ పెట్ట‌డం విమర్శలకు దారితీసింది. ఈ ఫోటోలో శశిథరూర్ తో పాటు మహిళా ఎంపీలంతా పార్టీలతో సంబంధం లేకుండా, సరదాగా నవ్వుతూ కనిపించడం విశేషం. 

ఈ ఫోటోలో తృణమూల్‌కు చెందిన నుస్రత్ జహాన్ , మిమీ చక్రవర్తి, అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్, ఎన్‌సిపికి చెందిన సుప్రియా సూలే, కాంగ్రెస్‌కి చెందిన జోతిమణి ,తమిజాచి తంగపాండియా లు శశిథరూర్ తో కలిసి ఫోటోకి ఫోజు ఇచ్చారు. ‘‘లోక్‌సభ పని చేయడానికి ఆసక్తికరమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు. ఈ రోజు ఉదయం నేను నా తోటి ఆరుగురు మహిళా ఎంపీలను కలిశాను’’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటో విమర్శలు మూటగట్టుకుంటుంది. 

దాంతో శ‌శిథ‌రూర్ కి ఆడ‌వాళ్లంటే మ‌హా పిచ్చ‌ని ..ఆయ‌నో ఉమ‌నైజ‌ర్ అని నెటిజన్స్ ట్రోల్స్ మొద‌లు పెట్టారు. ‘‘బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న మీరు.. మీ తోటి మహిళా ఎంపీల గురించి ఇలాంటి సెక్సియెస్ట్‌ కామెంట్‌ చేయడం ఎంత వరకు సబబు? అంటే మహిళలు అందంగా ఉంటారు.. వారితో కలిసి పని చేయడం సంతోషం అని మీ ఉద్దేశమా? ఆడవారు అంటే కేవలం వారి బాహ్య సౌందర్యం మాత్రమే కనిపిస్తుందా?. సమానత్వం అంటూ ప్రసంగాలు ఇస్తారు.. మరీ ఇదేంటి సార్‌?’’ అంటూ ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు. 

దాంతో శ‌శిథ‌రూర్ ఆత్మరక్షణలో పడి  మరో ట్వీట్ చేశారు. ‘‘ఇలా అందరం కలిసి సెల్ఫీ దిగడం మాకు చాలా సంతోషం కలిగించింది. ఇదంతా స్నేహపూర్వక వాతావరణంలో చోటు చేసుకుంది. అదే స్ఫూర్తితో వారు(మహిళా ఎంపీలు) ఈ ఫోటోను ట్వీట్‌ చేయమని కోరారు.. నేను చేశాను’ అంటూ చెప్పుకొచ్చారు. 

“కానీ ఈ ఫోటో వల్ల కొందరు బాధపడ్డట్లు తెలిసింది. అందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను. కాకపోతే పనిచేసే చోట ఇలాంటి స్నేహపూర్వక ప్రదర్శనలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అంటూ మరో ట్వీట్‌ లో తన పనిని సమర్ధించుకున్నారు. 

సుప్రీంకోర్టు న్యాయవాది కరుణ నుండీ స్పందిస్తూ, రాజకీయాల్లో ఉన్న లేదా రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలను తక్కువ చేసి చూపుతున్నారని మండిపడ్డారు. ఆకర్షణీయంగా ఉండటమే ప్రధాన సూత్రం, ప్రమాణం అని చెప్తున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ చేశారనేదానితో సంబంధం లేదని పేర్కొన్నారు.