తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి!

తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి!
మహిళా హక్కుల పరిరక్షణ, మహిళా సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం కీలకమైన తెలంగాణ మహిళా కమిషన్‌కు చైర్ పర్సన్‌గా  గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ గద్వాల  విజయలక్ష్మిని నియమించింది.  చైర్‌పర్సన్‌తోపాటు ఆరుగురు సభ్యులతో కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వు లు జారీచేశారు.
కాగా కాంగ్రెస్‌ అసలు నేతల కు రేవంత్‌ ప్రభుత్వం మొండిచెయ్యి చూపించి, వలస కాంగ్రెస్‌ నేత విజయలక్ష్మికే మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవి కట్టబెట్టడం కాంగ్రెస్ వర్గాలలో కలకలం రేపుతోంది. పార్టీ కోసం కష్టపడిన మాజీ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శార ద కేవలం 14 నెలలు మాత్రమే పని చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వచ్చిన కేశవరావు కుమార్తె విజయలక్ష్మికి ఈ పదవి కేటాయించడం గమనార్హం.
కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం పలువురు ప్రముఖ మహిళలకు అవకాశం కల్పించింది. ఈ నియామకాల్లో తెలంగాణ ఉద్యమం, సామాజిక సేవ, మహిళా హక్కుల ఉద్యమాల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతచారి త్యాగం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నియామకంతో తెలంగాణ ఉద్యమ కుటుంబాలకు ప్రభుత్వం గౌరవం ఇచ్చినట్లయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను కూడా కమిషన్ సభ్యురాలిగా కాంగ్రెస్ సర్కార్ నియమించింది. చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆమె కుటుంబానికి ఈ నియామకంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

మహిళా కమిషన్ సభ్యులుగా శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాభాయి, ఉజ్మా షకీరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తోందని, మహిళల సమస్యల పరిష్కారంలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ మహిళా కమిషన్ మహిళలపై జరిగే అన్యాయాలు, వేధింపులు, వివక్ష అంశాలపై చర్యలు తీసుకునే కీలక సంస్థగా పనిచేస్తుంది.