శాసనమండలి రద్దు కూడా వెనుకకు

మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఉపసంహరించుకున్న వైసీపీ ప్రభుత్వం.. తాజాగా శాసనమండలి రద్దు తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో మండలి రద్దును వెనక్కి తీసుకుంటూ తీర్మానాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. 

గత ఏడాది జనవరి 27న అసెంబ్లీలో మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసింది. దీంతో గత 22 నెలలుగా ఈ తీర్మానం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే ఇప్పటివరకు కేంద్రం ఎటువంటి నిర్ణయం రాలేదు. దీంతో తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

గతంలో శాసనమండలిని రద్దు చేయాలని చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో కొత్త తీర్మానం ప్రవేశపెట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శాసనమండలి రద్దు తీర్మానాన్ని జనవరి 27న అసెంబ్లీలో ప్రవేశపెట్టారని, అయితే ఆ తీర్మానానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదని చెప్పారు.

కేంద్రం ఆమోదం కోసం పంపిన ఆ తీర్మానం గడిచిన 22 నెలలుగా అక్కడే పెండింగ్‌లో ఉందన్నారు. దీంతో శాసనమండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడిందని, ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకే ప్రస్తుత నిర్ణయం తీసుకున్నామని, తద్వారా శాసనమండలిపై ఏర్పడిన సందిగ్ధత తొలగిపోతుందని బుగ్గన తెలిపారు. శాసనమండలిని యథాతథంగా కొనసాగించాలని కేందాన్ని మళ్లీ కోరుతామని పేర్కొన్నారు.