ఏపీలో పాఠశాల విద్యానాణ్యతకై ప్రపంచ బ్యాంక్‌ ఋణం

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థుల అభ్యసన నాణ్యతకు ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంక్‌ మధ్య రుణ ఒప్పందం జరిగింది. 
 
50 లక్షల మందికి పైగా విద్యార్థుల అభ్యసన నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో రూ.1,861.20 కోట్ల (250 మిలియన్‌ డాలర్ల) విలువ చేసే ప్రాజెక్ట్‌ కోసం కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు చట్టపరమైన ఒప్పందాలపై సంతకం చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
ఈ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రజత్‌ కుమార్‌ మిశ్రా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున డిపార్ట్మెంట్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్‌, ప్రపంచ బ్యాంక్‌ తరపున ఇండియా కంట్రీ డైరెక్టర్‌ జునైద్‌ అహ్మద్‌ సంతకం చేశారు. 
 
పాఠశాల విద్య అన్ని తరగతుల విద్యార్థులు ఈ ప్రాజెక్ట్‌ నుండి ప్రయోజనం పొందుతారని పేర్కొంది. అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రేడ్‌ 1, 2 ఉపాధ్యాయులకు స్వల్పకాల సేవలో శిక్షణా కోర్సుల ద్వారా ఫౌండేషన్‌ అభ్యాసనపై దష్టి కేంద్రీకరించడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. 
 
ఈ కేంద్రాలు, పాఠశాలల్లో బోధనాపరంగా తగిన బోధనా అభ్యాస సామగ్రి (టిఎల్‌ఎం) సరఫరా చేయడం చేస్తుంది. ఫౌండేషనల్‌ లెర్నింగ్‌పై ఇటువంటి శ్రద్ధ భవిష్యత్తులో లేబర్‌ మార్కెట్లకు అవసరమైన జ్ఞానం, సామాజిక ప్రవర్తన, భాషా నైపుణ్యాలతో పిల్లలను తయారు చేయడంలో పాఠశాలల సంసిద్ధతను మెరుగుపరుస్తుందని వివరించారు.