కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదాపై హైకోర్టు ఆగ్రహం

కృష్ణాజిల్లాలోని కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికను రెండో రోజుకూడా జరుపకుండా నిరవధికంగా వాయిదా వేయడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టిడిపి దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ , విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ హైకోర్టుకు రావాలని కోర్టు ఆదేశించింది. మధ్యాహ్నం 2.15గంటలకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

బుధవారం ఉదయం ఎన్నిక నిర్వహించి తీరాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేస్తూ.. ఈ మేరకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అలాగే ఎన్నికైన అభ్యర్థులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని విజయవాడ సీపీని హైకోర్టు ఆదేశించింది.

ఇక్కడ ఒక ఓటుతో టిడిపి ఆధిక్యతతో ఉండడంతో, ఆ పార్టీ చైర్మన్ పదవి గెల్చుకొనే అవకాశం కనిపించడంతో, వైసిపి సభ్యులు హింసాయుత వాతావరణం సృష్టించి, అక్కడ సామాగ్రిని ధ్వంసం చేసినా అధికారులు ప్రేక్షక పాత్ర వహించి, ఆ సాకుతో ఎన్నికను వాయిదా వేయడం వివాదాస్పదమైనది. 

శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ను ఎన్నుకునే క్రమంలో వైసిపి సభ్యులు న్యాయం కావాలంటూ బల్లలు చరుస్తూ నినాదాలు చేశారు. ఎంపి కేశినేని నాని ఓటు చెల్లదని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరసన తెలిపారు. 

అనంతరం కార్యాలయం నుంచి బయటకు వచ్చి పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. ఎంపి నందిగం సురేష్‌, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్‌, జోగి రమేష్‌ కనుసన్నల్లోనే వైసిపి సభ్యులు నినాదాలు చేస్తున్నారని టిడిపి సభ్యులు ఆరోపించారు. 

ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి సునీల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్ది చెప్పినా సభ్యులు తగ్గలేదని, దీంతో ఎన్నికకు అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. ”శాంతి భధ్రతలకు విఘాతం కలిగే పరిస్థితి వల్లే ఎన్నిక వాయిదా వేశాం. ఎన్నిక నిర్వహించలేకపోయిన విషయాన్ని ఎస్‌ఈసీకి నివేదించా. ఎఎంపి కేశినేని నాని హాజరును వ్యతిరేకిస్తూ కొందరు నినాదాలు చేశారు” అని చెప్పారు. 

కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా పడటంపై టిడిపి అధినే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కడప జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన ఆయన విధ్వంసం సృష్టించి ఎన్నికను వాయిదా వేయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ద్వజమెత్తారు. ఎన్నిక నిర్వహణ రాకపోతే ఎస్‌ఈసీ, డిజీపి తప్పుకోవాలని స్పష్టం చేసారు.