రచయిత్రిగా మారిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

అటు రాజకీయాలలో రాణిస్తూనే, ఇటు నటిగా కూడా మెప్పిస్తున్నారు స్మృతి ఇరానీ. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. తాజాగా రచయిత్రిగా మారి.. తనలోని రచనా పటిమను బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు.‘లాల్ సలామ్’ అనే పేరుతో ఓ నవలను రచించారు. 

ఏప్రిల్ 2010లో దంతేవాడలో జరిగిన 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోత ఇతివృత్తంగా ఆమె ఈ పుస్తకాన్ని రచించారు. దేశానికి సేవచేస్తూ.. ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకు ఈ పుస్తకం ద్వారా నివాళులర్పించనున్నారు. ‘లాల్ సలామ్’ అనేది విక్రమ్ ప్రతాప్ సింగ్ అనే ఒక యువ అధికారి అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి ఎదుర్కొన్న సవాళ్ల యొక్క కథ. ఈ పుస్తకం యొక్క కవర్ పేజీకి సంబంధించిన మోషన్ పిక్చర్‌ను స్మృతి ఇరానీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

‘కొన్ని సంవత్సరాలుగా ఈ కథ నా మనసులో మెదులుతూనే ఉంది. దానిని కాగితంపై పెట్టాలనే కోరికను నేను ఈ క్షణం వరకు మరచిపోలేదు. పాఠకులు ఈ కథను చదివి ఆనందిస్తారని నేను ఆశిస్తూ.. మీకు నచ్చేలా రాయడానికి ప్రయత్నించాను. ఇది దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి తీసుకోవడం జరిగింది’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. 

ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ వెస్ట్‌ల్యాండ్ ఈ పుస్తకాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పుస్తకాన్ని అమెజాన్ లో విడుదల చేయనున్నట్లు వెస్ట్‌ల్యాండ్ పబ్లిషర్ వీకే కార్తీక తెలిపారు. ఈ పుస్తకం ప్రీ ఆర్డర్స్ ఇప్పటికే అమెజాన్‌లో మొదలయ్యాయి. నవంబర్ 29 నుంచి ఈ పుస్తకం అందుబాటులోకి రానుంది. 

ఎన్నో థ్రిల్లింగ్ అంశాలతో రూపుదిద్దుకున్న ఈ ‘లాల్ సలామ్’ పుస్తకం పాఠకులను మొదటి నుంచి చివరి వరకు కట్టిపడేస్తుందని వెస్ట్‌ల్యాండ్ పబ్లిషర్ వీకే కార్తీక పేర్కొన్నారు.

బీజేపీలో కీలక నాయకురాలిగా ఉన్న స్మృతి ఇరానీ 2014లో ప్రధాని నరేంద్ర మోదీ  కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. స్మృతి ఇరానీ ప్రస్తుతం ప్రధాని మోదీ  కేబినెట్‌లో మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.