నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తున్నాం

భారత దేశంలో తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ  ప్రకటించారు.  జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ  రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశం కోసమే పని చేస్తున్నానని తెలిపారు. 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేశామని ప్రధాని ప్రకటించారు. 
 
వ్యవసాయ బడ్జెట్ ను ఐదింతలు చేశామని ప్రధాని గుర్తు చేశారు. తాను దేశ భవిష్యత్ కోసం పని చేస్తున్నానని చెబుతూ  ఫసల్ బీమా యోజనతో ముందుకెళ్తానని వెల్లడించారు. వ్యవసాయంలో అధిక ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.  గురుపూర‌బ్ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ఇవాళ ఉద‌య‌మే కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 
 
‘‘మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం’’ అని ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు.కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఒక వర్గాన్ని ఒప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు.
 
‘‘నేను దేశానికి క్షమాపణలు చెబుతున్నాను, స్వచ్ఛమైన హృదయంతో… మేం రైతులను వ్యవసాయ చట్టాలపై ఒప్పించలేకపోయాం. మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడానికి నేను ఇక్కడ ఉన్నాను… ఈ నెల పార్లమెంటు సమావేశాల్లో రద్దు లాంఛనాలను పూర్తి చేస్తాం’’ అని ప్రధాని మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 
 
‘‘జో కియా కిసానో కే లియే కియా, జో కర్ రహా హున్ దేశ్ కే లియే కర్ రహా హున్ (నేను చేసింది రైతుల కోసం, నేను చేస్తున్నది దేశం కోసం)’’ అని ప్రధాని మోదీ అన్నారు.దేశంలోని పేదలు, రైతుల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను కూడా ప్రధాన మంత్రి వివరించారు. 
 
‘‘నా ఐదు దశాబ్దాల కాలంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేను చూశాను… దేశం నన్ను ప్రధానమంత్రిని చేసినప్పుడు, నేను కృషి వికాస్, రైతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
 
వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో రైతు చ‌ట్టాల ర‌ద్దుపై తీర్మానం చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకుంటామని మోదీ పేర్కొన్నారు. దేశంలో 80 శాతం మంది సన్నకారు రైతులు ఉన్నారని, పది కోట్ల మందిపైగా రెండు హెక్టార్ల భూమి కంటే తక్కువగా ఉందని ప్రధాని గుర్తు చేశారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత సంవత్సరం నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ ఢిల్లీ సరిహద్దులలో  నిరసన దీక్షలను సంవత్సరం కాలంగా చేస్తున్నారు.  వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న పంజాబ్, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ ఉద్యమ ప్రభావం ఉండే అవకాశమున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
 నరేంద్ర మోదీ  ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఒక కీలక నిర్ణయాన్ని  వెనుకకు తీసుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. రెండు సార్లు కూడా రైతుల నుండి వచ్చిన తీవ్ర నిరసనల కారణంగా వెనుకడుగు వేయవలసి వచ్చింది. మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన కొత్తలో గత యుపిఎ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ సవరణ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి విఫల యత్నం చేశారు.