సీఎం అయ్యాకే సభలో అడుగు పెడుతా.. చంద్ర‌బాబు శ‌ప‌థం

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. సీఎం అయ్యాకే ఈ సభలో తిరిగి అడుగుపెడతానంటూ చంద్ర‌బాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. 

ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబును టార్గెట్ చేసి దూష‌ణ‌ల‌కు దిగారు. మంత్రి కొడాలి నాని.. చంద్ర‌బాబును లుచ్చా అని తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో దూషించారు. మంత్రి క‌న్న‌బాబు, ఇత‌ర ఎమ్మెల్యేలు కూడా చంద్ర‌బాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 

బాబు స‌తీమ‌ణిపై కూడా వైసీపీ నాయ‌కులు నోరు పారేసుకున్నారు. దీంతో తీవ్ర మ‌నస్థాపానికి గురైన చంద్రబాబు కంటతడి పెట్టారు. అనంతరం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. 

“పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశాం. జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశాం. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నాం. ఏనాడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు నేను చూడలేదు” అంటూ మండిపడ్డారు.

” ఇన్నేళ్లుగా జరగని అవమానాలను భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి.. కుప్పం ఎన్నికల తర్వాత నేను రావాలి. నా ముఖం చూడాలన్నా కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్‌లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా విమర్శించారు” అని పేర్కొన్నారు. 

“ఇన్ని సంవత్సరాలుగా ఏ పరువు కోసం పని చేశానో.. ఇన్నేళ్లుగా బతికామో.. నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి (మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసిన స్పీకర్) అవమానించారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా” అని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

వెక్కి వెక్కి ఏడ్చిన బాబు 

 సభనుంచి బయటకు వచ్చిన అనంత‌రం చంద్ర‌బాబు పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. దాదాపు రెండు నిమిషాల పాటు వెక్కివెక్కి ఏడ్చారు. విలేకరుల సమావేశంలో విల‌పిస్తూ గద్గద స్వరంతో మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో తాను అనేక ఆటుపోట్లు చూసినప్పటికీ గడిచిన రెండేండ్లలో ఏపీలో రాక్షసపాలన కంటే మించి అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

 “వ్యక్తిగ‌త దూషణలతో సభలో తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె నలుగురికి సహాయం చేయడమే తప్పా.. ఎవరిని ఏమి అనలేదు.. తనను రాజకీయంగా ప్రోత్సహించింది. ఆమె త్యాగాలు, నా పోరాటాలు ప్రజల కోసమే చేశారు తప్పా.. ఇతరులను ఇబ్బందులు పెట్టలేదు” అంటూ  ఆవేదన వ్యక్తం చేశారు.

అలాంటి వ్యక్తిపై బండబూతులు, ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని అంటూ మాజీ ముఖ్యమంత్రి కంట తడి పెట్టారు. 2018లో జరిగిన ఎన్నికల్లో 151మంది వైఎస్సార్‌సీపీ, 23 మంది టీడీపీ సభ్యులు గెలుపొందారు. అప్పుడు కూడా తాను బాధపడలేదు. ప్రజల కోసం ప్రతిపక్షంలో కూర్చోవడానికి నిర్ణయించానని తెలిపారు. 

కాని రెండున్నర సంవత్సరాలుగా తనతో పాటు తమ నాయకులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అవమానించారని పేర్కొన్నారు. తాను ఉమ్మడి రాష్ట్రంలో, ఏపీకి సీఎంగా పనిచేసిన సమయంలో ఏనాడు కూడా ప్రతిపక్షాలను అగౌరవ పరచలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తన తల్లిని దూషించారని, దీనిపై గట్టిగా వైఎస్‌ను ప్రశ్నించ డంతో తప్పు జరిగింది.. క్షమించమని అడిగారని గుర్తు చేశారు. ఇవాళ తిరిగి వైసీపీ నేతలు నీచ రాజకీయాల కోసం తన భార్యను లాగే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.