వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం పట్ల దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సంవత్సర కాలంగా ఈ అంశంపై నిరసనలు జరుపుతున్న రైతులు సంబరాలు చేసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ స్వాగతించారు.
సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం ద్వారా ప్రధాని గొప్ప రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని అమిత్‌షా కొనియాడారు. మోదీ నిర్ణయం దేశంలో సౌభ్రాతృత్వ వాతావరణాన్ని మరింత పెంచుతుందని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అమిత్‌షా వరుస ట్వీట్లలో ప్రధాని చర్యను అభినందిస్తూ, మన రైతులకు సేవలందించేందుకు, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండేందుకు భారత ప్రభుత్వ కట్టుబడి ఉందని ప్రధాని తన ప్రసంగంలో నిర్ద్వంద్వంగా చెప్పినట్టు పేర్కొన్నారు. ప్రధాని తన నిర్ణయాన్ని ప్రత్యేక పర్వదినమైన ‘గురు పూరబ్’ను ఎంచుకున్నారని గుర్తు చేశారు.
దీనిని బట్టే దేశ ప్రజల ప్రతి ఒక్కరి సంక్షేమం తప్ప మరో ఆలోచన లేదనే విషయాన్ని ఆయన చాటుకున్నారని అమిత్‌షా ప్రశంసించారు. గొప్ప రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని మోదీని ప్రశంసించారు. ఇదే విషయాన్ని నడ్డా కూడా తన ట్వీట్‌లో ప్రస్తావించారు. రైతుల పట్ల తనకున్న శద్ధను ప్రధాని చాటుకున్నారని తెలిపారు. సుపరిపాలనా దిశగా మోదీ ఎన్నో చర్యలు తీసుకున్నారని, సమష్టి కృషి, సమష్టి స్ఫూర్తిగా దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు మనమంతా కంకణబద్ధులు అవుదామని నడ్డా పిలుపిచ్చారు.
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశ్ పర్వదనం పూట ప్రధాని వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని, రైతులకు క్షమాపణలు చెప్పారని చెబుతూ ఇంతకంటే పెద్ద విషయం ఇంకేమీ ఉండదని పేర్కొన్నారు.
ఎట్టకేలకు రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానికి, హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పారని, ఇక పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే మిగిలిందని అమరీందర్ చెప్పారు. ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయని, ఈ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో సమస్య పరిస్కారం అయినట్లేనని వ్యాఖ్యానించారు.
ప్రధాని స్పష్టంగా ప్రకటన చేసిన తర్వాత కూడా రైతులు ఆందోళన కొనసాగిస్తామనడంలో అర్థం లేదని స్పష్టం చేశారు. రైతుల సమస్య పరిష్కారం తర్వాతే బీజేపీతో సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకుంటానని గత మూడు నెలల నుంచి చెబుతూ వచ్చానని ఆయన గుర్తుచేశారు.
కాగా, సాగు చట్టాలతో జరిగే మేలు గురించి కొన్ని రైతు గ్రూపులను ప్రభుత్వం ఒప్పించలేకపోయిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విచారం వ్యక్తం చేశా రు. కొత్త చట్టాలు చేయడం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యను తొలగించాలని ప్రభుత్వం భావించిందని చెప్పారు. అయితే రైతకు ఒనగూరే ప్రయోజనాలపై కొందరు రైతులను తాము ఒప్పించలేకపోయమని, ఇది విచారకరమని పేర్కొన్నారు.
కొత్త చట్టాలు తీసుకురావాలనే ప్రధాని ఆలోచన వెనుక రైతుల జీవితాల్లో ”విప్లవాత్మక మార్పులు” తీసుకు రావాలన్న ఉద్దేశమే ఉందని మంత్రి స్పష్టం చేశారు. గత ఏడేళ్లుగా వ్యవసాయం, రైతుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కనీస మద్దతు ధరను పెట్టుబడి ధర కంటే 1.5 రెట్లు పెంచాలని, సేకరణ రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. చిన్న రైతుల ఆదాయం పెరగేందుకు పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఇంతవరకూ రూ.1.62 లక్షల కోట్లు పంపిణీ చేశామని చెప్పారు.
పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు
మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ చట్టాలు రైతుల ఆమోదం పొందకపోవడంతో రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాలను ఉపసంహరిస్తామని మోడీ ప్రకటించడం ఆయనలోని రాజనీతిజ్ఞతను తెలుపుతోందని కొనియాడారు.
ఈ పరిణామం హర్షణీయమని పేర్కొంటూ గురునానక్ జయంతి సందర్భంగా మోడీ చేసిన ప్రసంగాన్ని ఆద్యంతం పరిశీలిస్తే జనవాక్కును శిరోధార్యంగా భావించినట్లుగా మనకు అవగతమవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. రైతుల పోరాటాన్ని రాజకీయ దృక్కోణంతో కాకుండా ఒక సామాజిక అంశంగా భావించి చట్టాలను ఉపసంహరించడానికి సుముఖత చూపిన బిజెపి నాయకత్వానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
పార్లమెంట్‌లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి