భారీ వర్షాలతో జలదిగ్బంధనంలో తిరుమల 

అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలిపిరి నడకమార్గం, కనుమదారుల్లో వరద నీటితో పోటెత్తుతున్నది. అటవీప్రాంతం భారీగా వస్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. నీటి ప్రవాహంతో మెట్లమార్గం జలపాతంలా కనిపిస్తున్నది. తిరుమల జలదిగ్బంధనంలో చిక్కుకు పోయింది. గత అర్ధశతాబ్ది కాలంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదని చెబుతున్నారు. 

ఇప్పటికే ముందు జాగ్రత్తలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం నడకదారిని, రెండు ఘాట్ రోడ్లను మూసివేసింది. వర్షంతో రెండో కనుమదారిలో వాహనాలు నిలిచిపోయాయి. వైకుంఠం క్యూలైన్‌లోని సెల్లార్లలోకి నీరు చేరింది. వర్షానికి మాడవీధులు జలమయమయ్యాయి. కాగా, అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఒక ప్రకటన లో తెలిపింది.  

తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డు లో విరిగిపడ్డ కొండచరియలను టీటీడీ అధికారులు, సిబ్బంది శ్రమించి తొలగింపజేశారు. భక్తుల సౌకర్యం దృష్యా ఈ మార్గంలో గంట పాటు తిరుమల నుంచి అలిపిరి, గంట పాటు అలిపిరి నుంచి తిరుమలకు చొప్పున వాహనాలను అనుమతీస్తున్నారు. భక్తులెవరు ఫోటోల కోసం వాహనాలు దిగడం, వాహనాలను ఆపి ఉంచడం లాంటివి చేసి తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించవద్దని  టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

భారీ వర్షాల కారణంగా అలిపిరి నుంచి  తిరుమల కు వెళ్ళే  ఘాట్ రోడ్ లో అనేక చోట్ల కొండ చరియలు విరిగి పడటంతో వాటి తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. మధ్యాహ్నం తరువాత పరిస్థితి ని అంచనా వేసి ఈ మార్గంలో వాహనాల ను అనుమతించే విషయం పై టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది.

నారాయణగిరి అతిథి గృహాలపై కొండ చరియలు విరిగిపడ్డాయి. మూడు గదులు ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో గదులలో  భక్తులు  ఎవరూ లేరు. దీంతో ప్రమాదం తప్పింది. నారాయణగిరి, ఎస్వీ గెస్ట్‌స్‌లో ఉన్న భక్తులను ఇతర ప్రాంతాలకు టీటీడీ అధికారులు తరలించారు.

భారీ వర్షంతో రెండో కనుమదారి ప్రమాదకరంగా మారింది. రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. హరిణికి సమీపంలో రహదారిపై చెట్టుకూలిపోయింది. కొండపై నుంచి రహదారిపైకి రాళ్లు, మట్టి కొట్టుకు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన దేవస్థానం బోర్డు చర్యలకు ఉపక్రమించింది.

వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిరుమలలో చిక్కుకు పోయిన భక్తులకు టిటిడి ఆహార ఏర్పాట్లు చేస్తున్నది. మరో వైపు శేషాచలకొండల నుంచి తిరుపతి నగరంలోకి వరద భారీగా వస్తున్నది. తుమ్మలగుంట చెరువు కట్ట తెగిపోయింది. కల్యాణి డ్యామ్‌ నిండిపోవడంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. 

వరద ఉధృతికి వరదరాజనగర్‌లో వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రైల్వే అండర్‌ బ్రిడ్జిలు నీటితో నిండిపోయాయి. కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో తిరుపతిలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కల్యాణి జలాశయం పూర్తి నీటిమట్టానికి చేరుకుంది. పాలసముద్రంలో వెంగళరాజకుప్పం చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

ఇక తిరుపతి నగరం ఎటుచూసినా చెరువును తలపిస్తోంది. తిరుపతిలో కుండపోత వర్షం కురుస్తోంది. చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా నగరం సముద్రాన్ని తలపిస్తోంది. ఏ రోడ్‌ చూసినా మనిషి లోతు నీళ్ళు ఉన్నాయి. మాధవ నగర్‌, గొల్లవానిగుంట, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

వెస్ట్‌ చర్చి, తూర్పు పోలీస్‌ స్టేషన్‌ వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జిల కింద భారీగా వర్షపు నీరు చేరింది. కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరమైతేనే ప్రజలు బయటికీ రావాలని అధికారులు సూచించారు. స్వర్ణముఖి నదిపై వంతెన కూలిపోవడంతో చిగురువాడ-కెసిపేట వద్ద రెండువైపుల వాహనాలు నిలిచిపోయాయి.

కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు ప్రహహిస్తోంది. రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌లు కూడా వర్షపు నీటితో నిండిపోయాయి. వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహించడంతో ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో భారీగా వరద చేరింది. దీంతో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ల్యాండింగ్‌ను అధికారులు నిలిపివేశారు.