కర్తపూర్ యాత్రకు సిద్దు గైరాజర్… పంజాబ్ కాంగ్రెస్ లో చిచ్చు!

మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ను పదవి నుండి దించి, పార్టీ నుండి వెళ్లిపోయే పరిస్థితులు సృష్టించిన తర్వాత కూడా కొద్దినెలల్లో ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలకు అంతం లేకపోవడం పార్టీ అధిష్ఠానమును కలవర పరుస్తున్నది.

ముఖ్యంగా రాహుల్ గాంధీ కోరిమరీ నియమింప చేసుకున్న ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దు ఈ కుమ్ములాటలకు కేంద్రం కావడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఊహించిన దానికి విరుద్ధంగా,  సింగ్ సిద్ధూ గురువారం కర్తార్‌పూర్‌ని సందర్శించిన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో లేకపోవడం పతాకస్థాయికి చేరుకున్న అంతర్గత కుమ్ములాటలు వెల్లడి చేస్తున్నాయి.

సిద్ధూ మీడియా సలహాదారు సురీందర్ దల్లా ప్రకారం, కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించడానికి సిద్దు అన్ని సన్నాహాలు చేసారు. అయితే, సిద్ధూ నవంబర్ 18కి బదులుగా నవంబర్ 20న కర్తార్‌పూర్‌ను సందర్శించవచ్చని బుధవారం రాత్రి అధికారికంగా తెలపడంతో ఆగిపోయాడు.

క్రికెటర్‌గా మారిన రాజకీయ నాయకుడు సిద్దు పాకిస్థాన్ నేతలతో తనకున్న సాన్నిహిత్యం కారణంగానే ఈ  కారిడార్‌ సాధ్యమైంనల్టు చెప్పుకొంటూ వస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఈ యాత్రను, గురునానక్ పుట్టినరోజు, నవంబర్ 19న జరుపుకునే గురుపూరబ్ తర్వాత పాకిస్తాన్‌లోని గురుద్వారాను సందర్శించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. 

చన్నీ నేతృత్వంలోని జాతాలో ఆయన మంత్రివర్గంతోపాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. చన్నీ ప్రతినిధి బృందం నుంచి సిద్ధూని తప్పించడంతో పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలు, ముఖ్యంగా సిద్ధూ, చన్నీ మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. సిద్ధూ శిబిరంలో అభద్రతా భావాన్ని కూడా  కలిగిస్తుంది. 

ప్రతినిధి బృందంలో సిద్ధూ ఉండటం వల్ల కాంగ్రెస్ నాయకులందరిలో ఆయన దృష్టి అంతా అతనిపైకి వచ్చేదని, అందుకనే అతను లేకుండా చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సిద్ధూ చివరిసారిగా 2019 నవంబర్‌లో కారిడార్‌ను ప్రారంభించినప్పుడు ఆలయాన్ని సందర్శించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరిగింది.

గురుపూరబ్‌కు ముందు కారిడార్‌ను తిరిగి తెరవాలన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన వారిలో సిద్ధూ అగ్రగామిగా ఉన్నారు. కారిడార్‌ను తిరిగి ప్రారంభించాలని ఆయన గతంలో కేంద్రాన్ని కోరారు. చన్నీ కర్తార్‌పూర్‌ని సందర్శించిన రోజున, సిద్ధూ కారిడార్‌ను వాస్తవం చేసే అంశంపై తన వంతు పాత్రను  చూపించే వీడియోల సంకలనాన్ని ట్వీట్ చేశాడు. 

ఆగస్ట్ 17, 2018న సిద్ధూ వాఘా సరిహద్దును సందర్శించినప్పుడు కారిడార్ ఆవశ్యకత గురించి మాట్లాడిన మాటలను అందులో చూపారు. గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించాలని సిద్ధూకు క్రికెట్ ఆడే నాటి స్నేహితుడైన ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించుకున్నట్లు, తన ప్రమాణస్వీకారంకు వచ్చిన సిద్ధుకు ఆ విషయం తెలిపినట్లు  పాకిస్థాన్ ప్రభుత్వ వెబ్‌సైట్ పేర్కొనడం గమనార్హం.