అఖిలేష్ పై మండిపడుతున్న సంత్ సమితి

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వాఖ్యలపై తక్షణమే క్షమాపణ చెప్పాలని అఖిల భారతీయ సంత్ సమితి మండిపడుతున్నది. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని  డిమాండ్ చేసింది. ఆయన చేసిన ‘చిల్లుంజీవి’ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో బుధవారం జరిగిన సభలో ఆయన బీజేపీని విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ మిత్ర పక్షాలతో కలిసి ఉమ్మడి రథయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఈ రథయాత్ర లక్నో వరకు సాగుతుంది. గంజాయి వంటి పదార్థాలను కాల్చడానికి ఉపయోగించే గొట్టాన్ని చిల్లుం అంటారు. 

అఖిల భారతీయ సంత్ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి జితేంద్రానంద సరస్వతి మాట్లాడుతూ, అఖిలేశ్ యాదవ్ సంయమనం లేకుండా చేసిన వ్యాఖ్యలపై తామంతా ఆగ్రహంగా ఉన్నామని పేర్కొన్నారు. 

సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను, సాధువులను పదే పదే అవమానిస్తూ, కించపరుస్తూ నిరంతరం వ్యాఖ్యలు చేస్తున్న రాజకీయ నాయకులను దేశవ్యాప్తంగా సాధువులంతా ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారని తెలిపారు. 

చిల్లర రాజకీయాల్లోకి సాధువులను లాగవద్దని డిమాండ్ చేస్తున్నారని ఆయన చెప్పారు. తమ హెచ్చరికను పట్టించుకోకుండా, కించపరిచే వ్యాఖ్యలను కొనసాగిస్తే ప్రజాగ్రహం రూపంలో పర్యవసానాలను ఎదుర్కొనవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు.