నేటి నుండి తిరిగి కర్తార్‌పూర్ కారిడార్‌

కర్తార్‌పూర్ కారిడార్‌ను ఈనెల 17వ తేదీ నుంచి తిరిగి తెరుస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఓ ట్వీట్‌లో తెలిపారు. కర్తార్‌పూర్ గురుద్వారా యాత్రను  కరోనా కారణంగా 2020 మార్చిలో సస్పెండ్ చేశారు. 

”కర్తార్‌పూర్ గురుద్వారా దర్శించాలనుకునే సిక్కు యాత్రికులందరికీ ప్రయోజనం చేకూర్చే కీలక నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకుంది. ఈనెల 17 నుంచి కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను తెరుస్తున్నాం. గురునానక్ దేవ్ పట్ల, సిక్కు కమ్యూనిటీ పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న ఆరాధనాభావాన్ని ఈ నిర్ణయం  చాటుతోం అమిత్‌షా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

పంజాబ్‌ బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీని గత ఆదివారంనాడు కలుసుకుని గురుపూరబ్‌కు ముందే కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 19న గురునానక్ జయంతిని గురుపూరబ్‌గా జరుపుకొంటారు. పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతుండటం, కర్తాక్‌పూర్ సాహిబ్‌ కారిడార్‌ను తెరవాలంటూ కాంగ్రెస్, అకాలీదళ్ సహా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. 

గురునానక్‌ గురుపరబ్ సందర్భంగా 1500 మంది భారతీయ సిక్కు యాత్రికులకు పాక్‌కు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్‌-పాక్‌ మధ్య 1974 ద్వైపాక్షిక ప్రోటోకాల్స్‌ మేరకు నవంబర్‌ 17-26 మధ్య యాత్రికులు అత్తారి – వాఘా ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ ద్వారా పాక్‌లో ఉన్న గురుద్వారాను సందర్శిస్తారని విదేశాంగ శాఖ పేర్కొన్నది.

గురు నానక్ జయంత్యుత్సవాలకు ముందు కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరిచినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. గురు పరబ్ సందర్భంగా వేలాది మంది భక్తులు సందర్శించడానికి వీలుగా సకాలంలో దీనిని తెరిచారని ట్వీట్ చేశారు. 

కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓ ట్వీట్‌లో, ‘‘కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను సకాలంలో తెరిచినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు నా కృతజ్ఞతలు. గురు నానక్ దేవ్‌ జీ గురు పరబ్ సందర్భంగా ఈ పవిత్ర క్షేత్రంలో పూజలు చేసేందుకు వేలాది మంది భక్తులకు అవకాశం దొరుకుతుంది’’ అని పేర్కొన్నారు. 

గురు నానక్ జయంత్యుత్సవాలు నవంబరు 19న జరుగుతాయి.  ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా నవంబరు 19కి ముందే కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అంతకుముందు కెప్టెన్ సింగ్ కోరారు. కాగా,   కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను నవంబరు 18న సందర్శించే తొలి బృందంలో పంజాబ్ కేబినెట్ మంత్రులు ఉంటారని ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్ని చెప్పారు. 

గురుదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ క్షేత్రం, పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌లను కలుపుతూ కర్తార్‌పూర్ కారిడార్ ఉంది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ జీవితంలో చివరి ఘడియలను ఈ గురుద్వారా దర్బార్ సాహిబ్‌లోనే గడిపారు.17 సంవత్సరాల పాటు వ్యవసాయం చేశారు.

పాక్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని రావి నది ఒడ్డున ఉన్న కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా భారత సరిహద్దు నుంచి 4.7  కిలోమీటర్ల దూరంలో ఉన్నది. భారత్,  పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా, ఈ మార్గం రెండు దేశాలమధ్య `శాంతి’ సంకేతంగా నిలుస్తున్నది. కరోనా కారణంగా భారత్ ఈ మార్గంను మూసివెస్టిన్నట్లు ప్రకటించినా, తాము మూయలేదని పాకిస్థాన్ ప్రకటించింది. 

నవంబర్, 2019 నుండి ఫిబ్రవరి, 2020 వరకు ఈ మార్గంలో 45 వేలమంది భారతీయులు గురుద్వారాకు వెళ్లారు. భారత్ నుండి వచ్చేవారు వీసా అవసరం లేకుండా వెళ్ళడానికి పాకిస్థాన్ అనుమతిస్తుంది.