కుటుంభం పాలన నుండి అభివృద్ధి వైపు యుపి

కేంద్రంలో, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఏండ్లుగా వంశ పాల‌న కొన‌సాగింద‌ని, కుటుంబ‌పాల‌న‌ల్లో యూపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు అణిచివేత‌కు గుర‌య్యాయ‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమ‌ర్శించారు. అయితే ఇప్పుడు మాఫియా, పేదరికం స్థానంలో అభివృద్ధిని యోగి ఆదిత్యనాథ్ పాలనలో యుపి ప్రజలు చూడగలుగుతున్నారని ఆయన చెప్పారు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన అనంత‌రం సుల్తాన్ పూర్‌లో ఏర్పాటు చేసిన సభ‌లో ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగిస్తూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఏండ్లుగా ఉత్త‌మాట‌లు చెప్పే ప్ర‌భుత్వాల‌ను చూశాం. గ‌త ప్ర‌భుత్వాలు రోడ్ క‌నెక్టివిటీ గురించి ఏమాత్రం ప‌ట్టించుకోకుండా ప్ర‌జ‌ల‌కు పారిశ్రామిక ప్ర‌గ‌తి గురించి క‌ల్లబొల్లి మాట‌లు చెప్పాయని ధ్వజమెత్తారు.

దాంతో మౌలిక స‌దుపాయాల కొర‌త ఏర్ప‌డి ఎన్నో ఫ్యాక్ట‌రీలు మూత‌ప‌డ్డాయని పేర్కొన్నారు. గ‌త ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల బాగోగులు ప‌ట్టించుకోలేదు. రాష్ట్రంలో ఎప్పుడూ విద్యుత్ కోత‌లు ఉండేవి. శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి స‌రిగా ఉండేది కాదు. అంతేగాక గత ముఖ్య‌మంత్రులు తమ ఇండ్లు ఎక్క‌డ ఉంటే అక్క‌డ మాత్ర‌మే అభివృద్ధి చేసేవారని ప్ర‌ధాని ధ్వజమెత్తారు.

మూడేళ్ల క్రితం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసినప్పుడు, ఒక్కరోజు కూడా ఇక్కడ విమానంలో దిగుతానని తాను ఎప్పుడూ అనుకోలేదని ప్రధాని మోదీ చెప్పారు. “ఇది రాష్ట్ర అభివృద్ధికి ఎక్స్‌ప్రెస్ వే,  కొత్త ఉత్తరప్రదేశ్‌కు మార్గం చూపుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే యుపిలోని ఆధునిక సౌకర్యాలకు ప్రతిబింబం. ఈ ఎక్స్‌ప్రెస్‌వే యుపి  బలమైన సంకల్ప శక్తికి ఎక్స్‌ప్రెస్ వే. యూపీలో లక్ష్యాల సాధనకు ఇది ప్రత్యక్ష నిదర్శనం’ అని మోదీ పేర్కొన్నారు.

ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి సామర్థ్యాలపై అనుమానం ఉన్న వారు ఈరోజు సుల్తాన్‌పూర్‌కు రావాలని ఆయన కోరారు. మూడు-నాలుగు సంవత్సరాల క్రితం కేవలం భూమి ఉన్న చోట ఇప్పుడు అలాంటి ఆధునిక ఎక్స్‌ప్రెస్ వే వచ్చిందని తెలిపారు.

అభివృద్ధి అనేది అంత‌టా ఒకేలా జ‌రుగాల‌ని చెబుతూ కొన్ని ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి జ‌రుగ‌డం, మ‌రికొన్ని ప్రాంతాలు ద‌శాబ్దాలుగా వెనుక‌బ‌డిపోవ‌డం ఏ దేశానికైనా మంచిది కాద‌ని  ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పుడు కేంద్ర‌, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్ర‌భుత్వం ఉన్న‌ద‌ని, ఈ డ‌బుల్ ఇంజిన్ గ‌వ‌ర్న‌మెంట్ హ‌యాంలో అభివృద్ధి వేగంగా జ‌రుగుతున్న‌ద‌ని ప్రధాని చెప్పారు. 

 కొంత‌మంది తాము చేస్తున్న అభివృద్ధి ఓర్వ‌లేక అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ని, అది స‌హ‌జ‌మేన‌ని మోదీ ఎద్దేవా చేశారు. యూపీలో గ‌త స‌ర్కారు త‌న‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని, త‌న‌తో క‌లిసి నిల‌బ‌డితే వాళ్ల ఓటు బ్యాంకు దెబ్బ‌తింటుంద‌నే భ‌యం వారిలో క‌నిపించేద‌ని ఆయన ఆరోపించారు. 

సీ-130 విమానంలో దిగిన మోదీ

ప్ర‌ధాని మోదీ సీ-130 హెర్క్యుల‌స్ విమానంలో ఈ ప్రారంభోత్స‌వానికి హాజ‌ర‌య్యారు. పూర్వంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ వేపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్‌పై ఆ సీ-130 విమానం ల్యాండ‌య్యింది. ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీతోపాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్‌, గ‌వ‌ర్న‌ర్ ఆనందీబెన్ ప‌టేల్ కూడా పాల్గొన్నారు.

ఈ ఎక్స్‌ప్రెస్ వేను మొత్తం 341 కిలోమీట‌ర్ల పొడ‌వుతో నిర్మించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే ల‌క్నో జిల్లాలో ల‌క్నో-సుల్తాన్‌పూర్ జాతీయ ర‌హ‌దారిపైగ‌ల‌ చౌద్‌స‌రాయ్ గ్రామం వ‌ద్ద ప్రారంభ‌మై.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌-బీహార్ స‌రిహ‌ద్దుకు తూర్పున 18 కిలోమీట‌ర్ల దూరంలో జాతీయ ర‌హ‌దారి 31 మీదగ‌ల హైద‌రియా గ్రామం వ‌ద్ద ముగుస్తుంది. 

అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఎయిర్‌ఫోర్స్ ఫైట‌ర్ జెట్‌లు ల్యాండ్ అవ‌డానికి, టేకాఫ్ అవ‌డానికి వీలుగా ఈ ఎక్స్‌ప్రెస్ వేపై నిర్మించిన 3.2 కిలోమీట‌ర్ల ఎయిర్ స్ట్రిప్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉన్న‌ది. ప్ర‌స్తుతం ఆరు లేన్‌ల‌లో నిర్మిత‌మైన ఈ ఎక్స్‌ప్రెస్ వేను భ‌విష్య‌త్తులో ఎనిమిది లేన్‌ల‌కు మార్చ‌నున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి అంచ‌నా వ్య‌యం రూ.22,500 కోట్లు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పు ప్రాంతాలు ప్ర‌త్యేకించి ల‌క్నో, బారాబంకీ, అమేథీ, అయోధ్య, సుల్తాన్‌పూర్‌, అంబేద్క‌ర్ న‌గ‌ర్‌, అజాంగ‌ఢ్‌, మ‌వూ, ఘాజీపూర్ జిల్లాల ఆర్థిక ప్ర‌గ‌తికి మ‌రింత ఊతం ఇవ్వ‌డం కోసం ఈ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించారు. ప్ర‌ధాని విమానం ఎయిర్ స్ట్రిప్‌పై ల్యాండ‌యిన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో చూడ‌వ‌చ్చు.