సోషల్ మీడియా ‘అరాచకమైనది’, నిషేధించాలి

సోషల్ మీడియా అరాచకమైనదని, దానిని నిషేధించాలని `తుగ్లక్’ పత్రిక సంపాదకులు, ప్రముఖ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి స్పష్టం చేశారు. ఢిల్లీలో కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏరాటుచేసిన జాతీయ పత్రికా దినోత్సవంలో కీలక ప్రసంగం చేస్తూ క్రమబద్ధమైన సమాజం మార్గంలో సోషల్ మీడియా అడ్డంకిగా ఉందని తెలిపారు. 
 
“సోషల్ మీడియాను చైనా ధ్వంసంచేసిందని, భారత్‌లో సుప్రీంకోర్టు సైతం సోషల్ మీడియా పాత్రపై ఆందోళన వ్యక్తంచేసిందని గుర్తు చేశారు. మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లను నిషేధించాలని కోరుతూ ఫేస్‌బుక్ లేకుండా మనం జీవించలేమా? అని ఆయన ప్రశ్నించారు. మయన్మార్, శ్రీలంకలో మాదిరి మనదేశంలో కూడా సోషల్ మీడియా అశాంతిని రెచ్చగొడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా “ప్రతి ఒక్కరి ఇమేజ్, జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాలకు” ప్రమాదం కలిగిస్తుందని గురుమూర్తి పేర్కొన్నారు. 

‘మీడియా అంటే ఎవరు భయపడరు?’ అన్న అంశంపై ఆయన ప్రసంగిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ పూర్తి డాక్యుమెంటేషన్ నిర్వహించాలని ఆయన ప్రెస్ కౌన్సిల్‌ను కోరారు. ఆ తర్వాత ఓ ప్రశ్నకు ఆయన ప్రతిస్పందిస్తూ ‘నిషేధం’ అనేది కఠినంగానే అనిపించవచ్చు. కానీ ‘అరాచకత్వాన్ని నిషేధించాలి’ అని తాను విశ్వసిస్తున్నానని స్పష్టం చేశారు. 
 
“మీరు అరాచకాన్ని కూడా ప్రశంసించవచ్చు… విప్లవాలు, సామూహిక హత్యలలో కూడా కొంత మంచి ఉంది. కానీ మీరు త్యాగాలపై నిర్మించిన  క్రమబద్ధమైన సమాజాన్ని ఆ విధంగా  సృష్టించలేరు” అని స్పష్టం చేశారు. 
 
ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాల పట్ల కొందరు సభ్యులు అసమ్మతి వ్యక్తం చేస్తూ త్రిపురలో జర్నలిస్టులను అరెస్టు చేయడం, ప్రభుత్వ సంస్థలు పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించినట్లు ఆరోపణలను ప్రస్తావించారు. వాటిపై గురుమూర్తి స్పందిస్తూ అధికార దుర్వినియోగానికి న్యాయవ్యవస్థ చెక్ పెడుతోందా అనేది చివరకు ముఖ్యమని తెలిపారు.
 
 “సుప్రీంకోర్టు పెగాసస్‌ను విచారిస్తోంది, మీ సమస్య ఏమిటి? బోఫోర్స్‌ విషయంలో వ్యవస్థ అంతటినీ ఆపేందుకు ప్రయత్నం జరుగుతోంది” అని చెప్పారు. పాఠశాలల్లో ట్రాన్స్‌జెండర్ పిల్లలను చేర్చడంపై ఎన్‌సిఇఆర్‌టి మాన్యువల్ “పిల్లల మనస్సులలో గందరగోళాన్ని సృష్టిస్తుందని కూడా ఆయన విమర్శించారు.
 
  ప్రజాస్వామ్యంలో కావలికుక్కలా మీడియా  
 
కాగా, భారత ప్రజాస్వామ్యంలో కావలికుక్కలా మీడియాకు కీలక పాత్ర ఉన్నదని కేంద్ర సమాచార, ప్రసారశాఖమంత్రి అనురాగ్‌ఠాకూర్ తెలిపారు. తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలను అడ్డుకోవాలని మీడియాకు ఆయన పిలుపునిచ్చారు. అందుకోసం ప్రభుత్వపరంగా కూడా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరోలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
 బోగస్ వార్తల కట్టడికి సమిష్టి కృషి అవసరమని జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో చెప్పారు. పౌరలు కేంద్రంగా న్యూస్ ఛానళ్లు, రేడియో, సోషల్ మీడి యా లేదా డిజిటల్ మీడియా పని చేయాలని ఆయన సూచించారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడిచాయని, రానున్న 25 ఏళ్లు దేశ పౌరుల కలలు నెరవేరేలా కలిసి పని చేయాలని ఠాకూర్ కోరారు.