
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేసిన తీరు గమనిస్తే ఆయనలో హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా సీనియర్లను కాదంటే ఎక్కడ అసమ్మతి స్వరం వినిపిస్తారో అన్న భయం కూడా వెల్లడవుతుంది.
ఇప్పటికే ఈటెల రాజేందర్ వ్యవహారంలో తొందరపడి అనవసరం రాద్ధాంతం చేసుకున్నామని అంతర్గతంగా విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ అటువంటి పరిస్థితులు తిరిగి తలెత్తకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. త్వరలో మంత్రివర్గంలో మార్పులకు సహితం కేసీఆర్ సిద్ధం అవుతున్నట్లు ఈ ఎంపిక స్పష్టం చేస్తున్నది.
ఈటల రాజేందర్‌ను సర్వశక్తులు ఓడినా ఓడించలేక పోవడంతో ఆయన సామాజిక వర్గం ముదిరాజ్ లను పార్టీకి దూరంగా పోకుండా కాపాడుకోవడం కోసమే రాజ్యసభ సభ్యునిగా ఉన్న కులానికి చెందిన బండ ప్రకాశ్‌ను ఎంపిక చేసారని భావిస్తున్నారు. ఆయనకు రెండేళ్లకు పైగా ఇంకా రాజ్యసభత్వం ఉన్నప్పటికీ, ఈటెల స్థానంలో మంత్రివర్గంలోకి తీసుకొంటామని హామీతో ఎమ్యెల్సీ చేస్తున్నట్లు తెలుస్తున్నది. బీసీలుగా ఎమ్యెల్సీ స్థానం ఆశించిన పలువురు పార్టీ నేతలకు దానితో నిరాశే మిగిలింది.
ఇక తమకు మంత్రిపదవులు దక్కలేదని అసంతృప్తిగా ఉన్న మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లను సంతృప్తి పరచడం కోసమే ఎంపిక చేస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆరుగురిలో నలుగురు అగ్రవర్ణాలకు చెందినవారు కాగా, ముగ్గురు రెడ్డి సామజిక వర్గంకు చెందినవారే.
ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయంలో స్వయంగా సీఎం హామీ ఇచ్చిన కోటిరెడ్డి, నిజామాబాద్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత వంటి పలువురు ఎమ్యెల్సీ స్థానం తప్పనిసరిగ్గా దక్కుతుందని ఎదురు చూసి నిరాశచెందారు.
సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి ఐఏఎస్‌కు రాజీనామా చేసిన 24 గంటల్లోపే ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ఐఏఎస్‌కు రాజీనామా చేయగా.. ప్రభుత్వం వెంటనే ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీతో పాటు కేబినెట్‌లోనూ అవకాశమిస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడంతోనే వెంకట్రామిరెడ్డి ఐఏఎస్‌కు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని తెలుస్తోంది.
హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కౌశిక్ రెడ్డిని ఈటెలపై పోటీ చేయించడం కోసం కాంగ్రెస్ నుండి పార్టీలో చేర్చుకున్న కేసీఆర్, సీట్ ఇవ్వకుండా గవర్నర్ కోటాలో ఎమ్యెల్సీగా చేయడంపై ప్రతిపాదనలు పంపారు. అయితే ఆ ప్రతిపాదనను గవర్నర్ పక్కన పెట్టడంతో ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చారు.
ఆరు ఎంఎల్‌సి స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ఆరుగురు టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు సమర్పించగా, మిగిలిన ఇద్దరు శ్రమజీవి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్లను అధికారులు బుధవారం పరిశీలించనున్నారు. ఆరుగురు టీఆర్‌ఎస్ అభ్యర్థులతోపాటు మరో ఇద్దరు జుజ్జుల భాస్కర్, బోజ్‌రాజ్ కోయల్కర్ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.
నామినేషన్ ఆమోదం పొందాలంటే పది మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులిద్దరినీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతిపాదించలేదని తెలిసింది. దీంతో రెండు నామినేషన్లు తిరస్కరణకు గురై, టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానున్నది
More Stories
హనుమాన్ జయంతి యాత్రకు సిపి ఆనంద్ భరోసా
ప్రభుత్వ భూముల్లో విల్లాలు.. కేటీఆర్ వందల కోట్ల కుంభకోణం
సద్గురు జగ్గీ వాసుదేవ్ కి వాటర్ ఛాంపియన్ అవార్డు