ముఖ్యమంత్రి కేసీఆర్ కు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని, ఆయనను జైలుకు పంపడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి భయమంటే ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. రైతుల సమస్యలు తెలుసుకుందామని వస్తే.. దాడులు చేయడమేంటని ప్రశ్నించారు.

సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ తమపై టీఆర్‌ఎస్‌ వాళ్లు దాడులు చేస్తుంటే పోలీసులు సినిమా చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 6,500కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా, 10 శాతం కూడా ప్రారంభించలేదని ధ్వజమెత్తారు. అసలు ‘వానాకాలం పంట కొంటరా? కొనరా?’ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

60 లక్షల టన్నుల ధాన్యం (40లక్షల టన్నుల బియ్యం) తీసుకునేందుకు ఎఫ్‌సీఐతో ఒప్పందం జరిగినా, రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనడంలేదని ఆరోపించారు. నెల రోజుల నుంచి ధాన్యం కుప్పలు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

రైతులను కొట్టించిన సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం సిగ్గుచేటని సంజయ్ విమర్శించారు. వానాకాలం పంట కొనే వరకు సీఎంను విడిచిపెట్టిది లేదని స్పష్టం చేశారు. అన్ని పంటలను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో పోలీసులే శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఫోన్‌ చేసినా డీజీపీ స్పందించడం లేదని సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. పోలీసులు తమ పార్టీ నాయకులను కొడుతూ, అరెస్ట్‌ చేస్తూ.. టీఆర్‌ఎస్‌ వారిని విడిచిపెడుతున్నారని విమర్శించారు. 

తమ పార్టీకి చెందిన 8 మంది నాయకుల వాహనాలను టీఆర్‌ఎస్‌ వారు ధ్వంసం చేశారని సంజయ్‌ ఆరోపించారు. రైతుల సమస్యలను పక్కదారి పట్టించాలనే టీఆర్‌ఎస్‌ వారు దమనకాండ సృష్టిస్తున్నారని విమర్శించారు. రైతుల పక్షాన టీఆర్‌ఎస్‌ మూకలతో వీరోచిత పోరాటం చేసిన  బీజేపీ కార్యకర్తల ధైర్యసాహసాలను సంజయ్‌ ప్రశంసించారు.