ఉత్తమ పర్యాటక గ్రామంగా పోచంపల్లి

ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా తెలంగాణలోని పోచంపల్లిని  ప్రపంచ పర్యాటక సంస్ధ గుర్తించింది. దీంతో తెలంగాణ రాష్టానికి మరో గౌరవం దక్కినట్టయ్యింది. చేనేత పనితనానికి ప్రసిద్ధి పొందిన పోచం పల్లికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వుంది. తాజాగా ప్రపంచ పర్యాటక సంస్ధ ఉత్తమ పర్యాటక కేంద్రంగా గుర్తించడంతో మరింతగా ప్రాచుర్యంలోకి రానుంది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని భూదాన్ పోచంప‌ల్లి గ్రామానికి అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించినట్టయ్యింది.

ఐక్య‌రాజ్య స‌మితికి అనుబంధంగా ఉన్న ప్ర‌పంచ ప‌ర్యాట‌క సంస్థ‌. భూదాన్ పోచంప‌ల్లిని ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపిక చేసింది. దీంతో ఈ గ్రామానికి పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం వుంది. భార‌త‌దేశం నుంచి 3 గ్రామాలు పోటీ ప‌డ‌గా భూదాన్ పోచంప‌ల్లి ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపికైంది. మేఘాలయలోని విజిలింగ్ విలేజ్‌గా ప్రఖ్యాతిగాంచిన ‘కాంగ్‌థాన్, మధ్యప్రదేశ్‌లోని చారిత్రాత్మక గ్రామం ‘లదురాబాస్’ కూడా పోటీ పడ్డాయి. డిసెంబ‌ర్ 2వ తేదీన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో భూదాన్ పోచంప‌ల్లి గ్రామానికి అవార్డును ప్ర‌దానం చేయ‌నున్నారు. 

1951లో మహాత్మా ప్రియశిష్యుడు ఆచార్య వినోభాబావే చేపట్టిన పాదయాత్ర ద్వారా దేశంలో ఒక కొత్త శకానికి ఈ ప్రాంతం నాంది పలికింది. ఇక్కడి భూదాత వెదిరె రామచంద్రారెడ్డి వినోభాబావే పిలుపు మేరకు హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేశారు. అనంతరం ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ సుమారు 44 లక్షల ఎకరాల భూమిని దాతల నుంచి సేకరించి భూమిలేని పేదలకు పంచి పెట్టారు. అలా మాములు పోచంపల్లిగా ఉన్న ఈ గ్రామం భూదానోద్యమంతో ‘భూదాన్ పోచంపల్లి‘గా మారింది.

అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలే కాదు నాటి నిజాంతో పాటు ఇతర అరబ్ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన పోచంపల్లి ప్రాంతం రానురాను ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభతో ‘సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకుంది. పోచంపల్లి చేనేత కళాకారులు వేసిన అనేక రకాల ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా తాజాగా పోచం పల్లి కూడా చేరిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోచం పల్లి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఈ గౌరవం దక్కడం ఆనందంగా వుందని ఆయన చెప్పారు

భూదాన్ పోచంప‌ల్లికి అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భించ‌డం ప‌ట్ల రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖరరావు  హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తెలంగాణ సాంస్కృతిక పున‌రుజ్జీవ‌నం దిశ‌గా ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్యాచ‌ర‌ణ ఫ‌లితంగా రాష్ట్రంలోని ప‌ర్యాట‌క ప్రాంతాలు అంత‌ర్జాతీయ గుర్తింపును సాధిస్తున్నాయ‌ని సీఎం తెలిపారు..