బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహన శ్రేణిపై టీఆర్ఎస్ పార్టీ ముసుగులోని గూండాలు దాడి చేసారంటూ రాష్ట్ర బిజెపి నేతలు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను తెలుసుకోవడానికి వెళ్లిన తమపై గూండాలతో దాడులు చేయించిన కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని సంజయ్ హెచ్చరించారు.
రైతులు తమ ఇబ్బందులు చెప్పుకుంటున్నారని, అది తట్టుకోలేక టీఆర్‌ఎస్ నాయకులు దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాళ్ల దాడిలో ఎనిమిది కార్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. దాడికి బదులు తీర్చుకుంటామని స్పష్టం చేశారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనను టీఆర్‌ఎస్ శ్రేణులు అడుగడుగునా అడ్డుకున్నాయి. నల్లగొండ, వేములపల్లి, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల్లో దాడులను ఎదుర్కొంటూ పర్యటనను ముగించిన సంజయ్ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పెన్‌పహాడ్ మండలానికి చేరుకున్నారు.
బండి సంజయ్ వెళ్లిన ప్రతీ గ్రామంలోనూ విద్యుత్ సరఫరాను నిలిపివేసిన టీఆర్‌ఎస్ శ్రేణులు దాడులకు దిగాయి. అనాజీపురంలో ఏకంగా రాళ్లదాడి జరిగింది. సంజయ్ పర్యటనలో చివరిదైన జానారెడ్డినగర్‌కు వెళ్లే క్రమంలో దాడులు చేస్తుండటంతో రూట్ మార్చి సూర్యాపేట మండలం తాళ్ల ఖమ్మంపహాడ్ గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే రాత్రి తొమ్మిది గంటలైంది.
సమాచారం అందుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీగా మోహరించి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. బీజేపీ శ్రేణుల రక్షణతో సంజయ్ అక్కడే గంటసేపు కారులోనే ఉండిపోయారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్ అక్కడికి చేరుకొని భారీ బందోబస్తు నడుమ సంజయ్ కాన్వాయ్‌ని ఇమాంపేటకు తీసుకొచ్చారు.
అక్కడ టీఆర్‌ఎస్ కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ చక్రాలు పెట్టి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు.
టీఆర్ఎస్ వైఫల్యాలపై రైతులు, ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తిరగబడే రోజు ఆసన్నమైందని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హెచ్చరించారు.
రైతుల దగ్గరకి బీజేపీ నాయకులు వెళ్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని ఆయన ధ్వజమెత్తారు. మొత్తం కేసీఆర్ కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. శాంతి భద్రతలను కాపాడటం లో కేసీఆర్ సర్కారు విఫలం అయ్యిందని ఆయన మండిపడ్డారు.
రైతులకు టీఆర్ఎస్ చేసిన మోసం, దగా పూర్తిగా అర్థం అయ్యిందన్నారు. రైతులకు చేసిన మోసాలకు కేసీఆర్ సర్కారు తగిన మూల్యం చెల్లించే రోజు ఆసన్నమైందని రఘునందనరావు హెచ్చరించారు. పోలీసులు కేసీఆర్ సర్కారుకు భయపడి చేష్టలుడిగి చూస్తున్నారని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు.
బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోని రైతులను కలవడానికి వెళ్తే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అడ్డుకోవడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాజకీయం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడంలేదని విస్మయం వ్యక్తం చేశారు. ‘రైతులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి.. రైతులను మోసం చేసే ముఖ్యమంత్రి అయ్యాడని ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో మాత్రం ప్రతి గింజా కొంటాం అంటారు. బయట మాత్రం కేంద్రంపై అబంఢాలు వేస్తారు. సీఎం కేసీఆర్ చాలా తెలివిగలవాడినని అనుకుంటారు. కానీ అంత తెలివిగలవారయితే చిన్నచిన్న విషయాలపై రాజకీయం చేయరని విమర్శించారు. ఒక హుజురాబాద్ ఉపఎన్నికలో ఓడిపోతేనే ఇంత రెచ్చిపోయి మాట్లాడాలా? అని ప్రశ్నించారు. ముందుముందు ఇంకా చాలా ఎన్నికలు వస్తాయని స్పష్టం చేశారు.
“మీరు భయంతో ముందస్తు ఎన్నికలకు కూడా పోయేలా కనిపిస్తున్నారు. ఆ ఎన్నికలలో ఎంత బలం పెడతారో పెట్టండి. మీరు తప్పుడు కామెంట్లు చేస్తూ గెలవాలనుకుంటున్నారు. మా అధ్యక్షుడు నిజాలు మాత్రమే కామెంట్ చేస్తారు. ఆయనపై మాకు గర్వంగా ఉంది. చిన్నచిన్న నేతలతో కలిసి తప్పుడు కామెంట్లు చేస్తే మీకే నష్టం అయితది. యావత్ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు” అంటూ కేసీఆర్ ను రాజాసింగ్ హెచ్చరించారు.
More Stories
హనుమాన్ జయంతి యాత్రకు సిపి ఆనంద్ భరోసా
ప్రభుత్వ భూముల్లో విల్లాలు.. కేటీఆర్ వందల కోట్ల కుంభకోణం
సద్గురు జగ్గీ వాసుదేవ్ కి వాటర్ ఛాంపియన్ అవార్డు