బండి సంజయ్ కాన్వాయ్‌పై గుడ్లు, రాళ్లతో దాడి

మిర్యాలగూడలో బండి సంజయ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తత మధ్య సాగింది. పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు విఫల యత్నం చేశారు. బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌ నేతలు బాహాబాహీకి దిగారు. మోదీ డౌన్ డౌన్ అంటూ టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌  డౌన్ డౌన్ అంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశాయి. ఎమ్మెల్యే భూపాలరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు పార్టీలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది .దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
 
ఈ క్రమంలో బండి సంజయ్ వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు.  కాన్వాయ్‌పై దాడికి నిరసనగా నార్కెట్‌పల్లి అద్దంకి జాతీయ రహదారిపై బైఠాయించిన బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా ఎస్పీ రంగనాధ్ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంఘటన స్థలానికి చేరుకొని  పోలీసులను అప్రమత్తం చేశారు. 

రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజినిలా మారాడని సంజయ్  ధ్వజమెత్తారు. ఒకసారి పత్తి వేయమని, ఒక సారి ధాన్యం వెయ్యమని, మరోసారి వద్దని రైతులను తప్పుదారి పట్టిస్తున్నాడని మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం కొనాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. 

సమస్య పరిష్కరించకుండా ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని, టీఆర్‌ఎస్‌ శ్రేణులు రైతుల్లా వచ్చి గొడవ చేస్తున్నారని మండిపడ్డారు. వానాకాలంలో పంట మొత్తం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. గతేడాది 1.41 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రం కొనుగోలుచేసిందని, వరి మద్దతు ధరను రూ.1,960కు పెంచిందని గుర్తు చేశారు.

పంటలన్నీ కేంద్రం కొనుగోలు చేస్తే కేసీఆర్‌ ఏం చేస్తారని సంజయ్  ప్రశ్నించారు. రైతుల కోసం రాళ్ల దాడికి కూడా సిద్ధమేనని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. రైతులపై రాళ్లతో దాడి చేస్తారా.? అని మండి పడ్డారు. కాగా, నల్లగొండ జిల్లా ఆర్జాలబావి ఐకేపీ సెంటర్‌ను బండి సంజయ్‌ పరిశీలించారు. ఈ నేపథ్యంలో.. స్థానిక బీజేపీ నేతలు బండి సంజయ్‌కు స్వాగతం పలికారు.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లెపల్లి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తల ధర్నా నిర్వహించారు. గో బ్యాక్ బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు. అదే విధంగా  నేరెడుచర్ల మండలం చిల్లపల్లి బ్రిడ్జి వద్దకు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బండి‌ సంజయ్ పర్యటనను అడ్డుకునేందుకు బ్రిడ్జ్ వద్దకు వస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు వస్తుండటంతో పోలీసులు భారీగా మొహరించారు.  

ఈ పర్యటనను అడ్డుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు ఆధ్వర్యంలో​ పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఐకేపీ సెంటర్‌ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఐకేపీ సెంటర్‌ను పరిశీలించిన బండి సంజయ్‌ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.