స్వాతంత్య్ర పోరాటం చేసిన గిరిజనులను ఇప్పుడు గౌరవిస్తున్నాం

స్వాతంత్య్ర పోరాటంలో గిరిజన సమాజం అందించిన సేవలను ఇప్పుడు సగర్వంగా గౌరవిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ భోపాల్‌లో తెలిపారు. “ఈ రోజు, భారతదేశం తన 1వ ‘జంజాతీయ గౌరవ్ దివస్’ని జరుపుకుంటుంది. స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా గిరిజన సమాజం కళ, సంస్కృతి, స్వాతంత్య్ర పోరాటం, జాతి నిర్మాణానికి వారి  సహకారంను గర్వంగా గుర్తుంచుకుంటుంది. గౌరవిస్తుంది” అని భోపాల్‌లో జరిగిన జనజాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళన్‌లో ప్రధాని ప్రకటించారు.

“దేశ నిర్మాణానికి గిరిజన సమాజం సహకారం గురించి మనం  చర్చించినప్పుడు, కొంతమంది ఆశ్చర్యపోతారు. భారతదేశ సంస్కృతిని బలోపేతం చేయడంలో గిరిజన సమాజానికి పెద్ద పాత్ర ఉందని వారు నమ్మలేకపోతున్నారు. దేశానికి దాని గురించి ఎప్పుడూ చెప్పలేదు లేదా చీకటిలో ఉంచారు. దానిపై చాలా పరిమిత సమాచారం మాత్రమే ఇచ్చారు” అంటూ గత పాలకులను దుయ్యబట్టారు. 

 
స్వాతంత్య్రంత ర్వాత దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన వారు తమ స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇది జరిగిందని ప్రధాని విమర్శించారు. దశాబ్దాలుగా, భారతదేశ జనాభాలో దాదాపు 10 శాతం మంది ఉన్నప్పటికీ, ప్రజల సంస్కృతి, సామర్థ్యాన్ని విస్మరించారని మండిపడ్డారు. వారి సమస్యలు, విద్య , ఆరోగ్యం వారికి ఏమీ పట్టలేదని చెప్పారు.

“నేను ప్రముఖ చరిత్రకారుడు,  పద్మవిభూషణ్ బాబాసాహెబ్ పురందరేను కూడా గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. ఆయన మరణించారని ఈ ఉదయం నాకు తెలిసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను సామాన్య ప్రజలకు చేరవేయడంలో ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది” అని తెలిపారు.

భోపాల్ తొలి గోండు రాణి రాణి కమలపతి పేరు మార్చిన హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించేందుకు మోదీ మధ్యాహ్నం భోపాల్ చేరుకున్నారు. జంబోరీ మైదాన్‌లో జరిగిన భారీ ర్యాలీలో మోదీ ప్రసంగించి, స్టేషన్‌ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జంబోరీ గ్రౌండ్‌లో సన్నాహాలను స్వయంగా పర్యవేక్షించారు.

రాంచీలో బిర్సా ముండా స్మారకం 

తొలుత, ధార్తీ ఆబాగా ప్రసిద్ధి చెందిన గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జ్ఞాపకార్థం ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలో మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ధార్తీ ఆబా ఎక్కువ కాలం జీవించలేకపోయినప్పటికీ  భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసేలా  భారత చరిత్రలో లిఖించబడిని ఒక మహోన్నత వ్యక్తి అని అభివర్ణించారు. 
 
అంతేకాదు ముండాకు భారతదేశ గిరిజన సమాజ గుర్తింపును చెరిపివేయాలని కోరుకునే భావజాలానికి వ్యతిరేకంగా పోరాడిని గొప్ప వ్యక్తి బిర్సా అని తెలిపారు. ఆధునికత పేరుతో వైవిధ్యంపై దాడి చేయడం, ప్రాచీన గుర్తింపును, ప్రకృతిని తారుమారు చేయడం సమాజ శ్రేయస్సుకు మార్గం కాదని భగవాన్ బిర్సాకు తెలుసని పేర్కొన్నారు. ఆధునిక విద్యకు అనుకూల మార్పు కోసం వాదించాడని గుర్తు చేశారు.
అంతేకాదు తన గిరిజన సమాజంలోని లోటుపాట్లను గురించి మాట్లాడే ధైర్యం చూపించాడని ప్రధాని చెప్పారు..  జార్ఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ మ్యూజియం రాంచీలోని బిర్సా ముండా తుది శ్వాస విడిచిన  సెంట్రల్ జైలులో ఉంది.  ఇక్కడ 25 అడుగుల ఎత్తు ఉన్న ముండా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.  ఈ మ్యూజియం ఆదివాసీలు తమ అడవులు, భూమి హక్కులు, సంస్కృతిని పరిరక్షించడానికి  వారు ప్రదర్శించిన శౌర్యాన్ని, త్యాగాలను ప్రతిబింబిస్తుందని ఇది దేశ నిర్మాణానికి చాలా ముఖ్యమైనదని అని మోదీ పేర్కొన్నారు. 
 
పైగా ముండాతో పాటు, బుధు భగత్, సిద్ధూ-కన్హు, నీలాంబర్-పీతాంబర్, దివా-కిసున్, తెలంగాణ ఖాదియా, గయా ముండా, జాత్రా భగత్, పోటో హెచ్ భగీరథ్ మాంఝీ  గంగా నారాయణ్ సింగ్ వంటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధులను కూడా ఈ మ్యూజియం హైలైట్ చేస్తుంది.