ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా!

రాజధానిపై ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని మార్చడానికి వీల్లేదని రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ స్పష్టం చేశారు. రాజధాని ఏర్పాటు విషయంలో పార్లమెంటు ఒక పక్రియను నిర్ణయించిందని, దానిని పక్కనబెట్టి ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చడానికి వీల్లేదని రాష్ట్ర హైకోర్టు లో తేల్చి చెప్పారు. 

‘అమరావతిని రాజధానిగా నిర్ణయించే విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసింది. విభజన చట్టంలోని 5, 6 సెక్షన్లలో ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో సూచనలు, ప్రత్యామ్నాయాలు చెప్పేందుకు కేంద్రం శివరామకృష్ణన్‌ కమిటీని వేసింది. కమిటీ ఇచ్చిన నివేదికలో 52 శాతం మంది ప్రజలు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు కావాలని కోరుకున్నారు’ అని గుర్తు చేశారు. 

 విభజన చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం కొత్తగా ఏర్పడే రాజధానిలో రాజ్‌భవన్‌, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, హైకోర్టు తదితర నిర్మాణాల కోసం కేంద్రం ఆర్థిక సహాయం చేయాలి. ఆ చట్టంలో ఒక రాజధాని గురించే ప్రస్తావన ఉంది. ప్రభుత్వాలు మారుతుంటాయి. కానీ రాష్ట్రం మాత్రం స్థిరంగా ఉంటుంది. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చడానికి వీల్లేదని అంటూ వాదనలు వినిపించారు. 

మూడు రాజధానుల నిర్ణయం.. రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను హతమార్చడమేనని పేర్కొంటూ మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయకపోతే అమరావతి ఆత్మను తీసేసినట్లేనని తెలిపారు.  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రాజధాని కేసుల విచారణ చేపట్టింది. 

పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామరావు, మరికొంతమంది రైతులు వ్యాజ్యాలు  దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం హైబ్రిడ్‌ విధానం (భౌతికంగా, ఆన్‌లైన్‌)లో తుది విచారణ ప్రారంభించింది.

రాష్ట్ర విభజన, విభజన చట్టం, సీఆర్‌డీఏ చట్టం, అమరావతిని రాజధానిగా నిర్ణయించడం, వివిధ ప్రాజెక్టులపై చేసిన ఖర్చు తదితర వివరాలను పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ కోర్టు ముందు ఉంచారు. రాజధాని అభివృద్ధిలో ప్రజలను, రైతులను భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో నాటి ప్రభుత్వం భూసమీకరణ విధానాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.

భూమి ఇచ్చినందుకు బదులుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనం కోసం రైతులు తమ జీవనాధారమైన 33,771 ఎకరాల భూమిని త్యాగం చేశారు.  భూములిచ్చిన 29,754 మంది రైతుల్లో 26,700 మంది చిన్న రైతులే అని తెలిపారు. మూడు రాజధానులు ఏర్పాటు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని చెప్పి రైతులకు ఇచ్చిన హామీని విస్మరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

రాజధాని అమరావతిలో రూ.5,674 కోట్లు విలువ చేసే పనులు పూర్తయ్యాయి. వాటన్నిటినీ ఈ ప్రభుత్వం విస్మరించింది. వివిధ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ వదిలేసింది. ఉద్దేశపూర్వకంగా రాజధాని అమరావతిని ఘోస్ట్‌ సిటీగా మార్చేసింది. ప్రభుత్వ వైఖరితో అమరావతి అభివృద్ధికి నిధులు ఇస్తున్న ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రాజెక్టు నుంచి వైదొలిగాయని వివరించారు.